Begin typing your search above and press return to search.

ఈటెల మాదిరి చేయలేకపోయారేంటి కేసీఆర్?

By:  Tupaki Desk   |   22 April 2021 3:29 AM GMT
ఈటెల మాదిరి చేయలేకపోయారేంటి కేసీఆర్?
X
మాటలు ఎవరైనా చెబుతారు. కానీ.. అందుకు భిన్నంగా చేతల్లో చూపిస్తారు కొందరు. మాటల్లోనే చేతలకు మించి సినిమా చూపించే వాళ్లు ఇంకొందరు. ఆ కోవలోకే వస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అంటూ భారీ మాటలు చెప్పే ఆయన.. కరోనా మహమ్మారి విరుచుకుపడే అవకాశం ఉందన్న వేళ.. మాస్కులు పెట్టుకోకుండా పని చేస్తామన్న భారీ డైలాగు ఆయన నోటి నుంచి వచ్చింది. కరోనా మీద అవగాహన అంతంత మాత్రంగా ఉన్న వేళ.. అలాంటి మాటలు రావటాన్ని అర్థం చేసుకోవచ్చు. దాన్ని మరీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే.. కొన్ని సందర్భాల్లో భయంతో వణికించే బదులు.. ధీమాతో భరోసా కలిగింద్దామన్నది కేసీఆర్ ప్రయత్నంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తన మాటలకు మరికాస్త మెలోడ్రామాను కలిపి.. సన్నివేశాన్ని పండించే క్రమంలో అవసరానికి మించిన అతిశయం ఆయన మాటల్లో వినిపించటం.. ఆ మాటల వీడియోలు ఎప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. విపత్కర వేళ.. ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇవ్వాల్సిన సందేశం ఏమిటి? అన్నది ప్రశ్న.

కేసీఆర్ కు ప్రాణం అంటే లెక్క లేదు. ప్రజల కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా ఆయన నోటి నుంచి అదే పనిగా వస్తుంటుంది. మరీ.. అంతలా కాకున్నా.. తెలంగాణ రాష్ట్ర కోవిడ్ నోడల్ ఆసుపత్రిగా గాంధీ ఆసుపత్రిని సిద్ధం చేసి.. అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నప్పుడు.. తనకు కరోనా వచ్చిన సందర్భంగా ప్రభుత్వ దవాఖానాలో చూపించుకుంటే ఎంత బాగుండేది? గాంధీ అంటే.. కేవలం సీరియస్ కేసుల్ని మాత్రమే చూస్తారనుకుందాం. గచ్చిబౌలిలోని టిమ్స్ కానీ.. కింగ్ కోఠి ఆసుపత్రికి కాని వెళ్లి ఉంటే మరెంత బాగుండేది?

ముఖ్యమంత్రి వారు వస్తున్నారన్నంతనే ఏర్పాట్లు మరింతగా బాగు చేయటం జరుగుతుంది. దీని వల్ల సామాన్యులకు మేలు జరుగుతుంది. అదొక్కటే కాదు.. ఆ సందర్భంగా వాస్తవ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకునే వీలుంది. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ విషయానికే వద్దాం. తనకు కరోనా వస్తే.. తాను గాంధీలో చేరతానని చెప్పేవారు. వ్యాక్సిన్ విషయంలోనూ ఆయన తాను చెప్పినట్లే చేశారు. ఈటెలను కూడా పక్కన పెట్టేద్దాం. కేసీఆర్ అమితంగా అభిమానించే మాజీగవర్నర్ నరసింహన్ సంగతే చూద్దాం. తనకేమైనా ఆరోగ్య సమస్యలు వస్తే గాంధీ..నిమ్స్ ఇలా ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లేవారు.

సీబీఐ లాంటి అత్యుత్తమ సంస్థకు చీఫ్ గా వ్యవహరించి.. ఒక రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించే వేళ నరసింహన్ కోరుకుంటే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లటం పెద్ద విషయమే కాదు. కానీ.. తనకు తాను సర్కారీ దవాఖానాకు వెళ్లటం ద్వారా ప్రజలకు సానుకూల సందేశాన్ని ఇవ్వటంతో పాటు.. అక్కడి పరిస్థితుల్ని సమీక్షించేవారు. ఈ కారణంతోనే కావొచ్చు.. ఆయన పాల్గొన్న సమావేశాల్లో ప్రభుత్వ వైద్య విధానంపైనా.. సర్కారీ ఆసుపత్రులపై ఆయన తీవ్ర అసంత్రప్తి వ్యక్తం చేసేవారు. ఘాటు వ్యాఖ్యలకు వెనుకాడేవారు కాదు. కార్పొరేట్ ఆసుపత్రుల తీరును తీవ్రంగా తప్పు పట్టేవారు. మరి.. తాను అభిమానించే వ్యక్తిని..తెలంగాణ ప్రజల కోసమే నిత్యం శ్వాసించే మహానేత.. తనకుఆరోగ్యం బాగోలేనప్పుడు తెలంగాణ సగటు జీవి వెళ్లే ఆసుపత్రికి ఎందుకు వెళ్లలేకపోతున్నారు? సాధ్యం కాదన్న కరెంటు సమస్యను తీర్చేసిన కేసీఆర్ కు.. సరిగా ఫోకస్ చేయాలే కానీ.. తెలంగాణ రాష్ట్ర సర్కారీ ఆసుపత్రుల దశను.. దిశను మార్చటం అంత పెద్ద విషయమంటారా?