Begin typing your search above and press return to search.

సోము సార్‌.. ఎంత డ్యామేజీ చేశారో.. తెలుసా?

By:  Tupaki Desk   |   30 Dec 2021 1:30 PM GMT
సోము సార్‌.. ఎంత డ్యామేజీ చేశారో.. తెలుసా?
X
రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు ఆచితూచి అడుగులు వేయాలి. భావోద్వేగాల‌కు.. తాత్కాలిక ఆగ్ర‌హాల‌కు, ఆవేశాల‌కు అత్యంత దూరంగా ఉండాలి. ఈ విష‌యంలో ఏ చిన్న తేడా వ‌చ్చినా.. ప‌రిస్థితి చేయి దాటి పోవ‌డం ఖాయం. ఇప్పుడు ఈమాట ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. సీనియ‌ర్ నాయ‌కుడు.. పైగా ఆర్ ఎస్ ఎస్ వాదిగా పేరున్న సోము వీర్రాజు ఇచ్చిన ఒకే ఒక్క హామీ.. సంప్ర‌దాయ బీజేపీ వాదుల‌నుకూడా పార్టీకి దూరం చేసే ప్ర‌మాదాన్ని తీసుకువ‌చ్చింది. దీంతో ఇప్పుడు సోము మ‌రింత ప‌లుచ‌న అయిపోయార‌ని అంటున్నారు.

విజ‌య‌వాడ వేదిక‌గా.. బీజేపీ నాయ‌కులు తాజాగా ప్ర‌జాగ్ర‌హ స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు ఢిల్లీ నుంచిరాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా నాయ‌కులు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ప్ర‌సంగించిన సోము.. పార్టీ భ‌విత‌వ్యాన్ని ప్ర‌క‌టించాల్సి ఉంటే బాగుండేది. కానీ, ఆవేశానికి గుర‌య్యారు. ఒకింత ఆవేద‌న‌కు కూడా లోన‌య్యారు. ఈ క్ర‌మంలోనే ఇవ్వ‌కూడ‌ని హామీని ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ ఇవ్వ‌ని హామీని ఆయ‌న ప్ర‌స్తావించారు. తాము అధికారంలోకి వ‌స్తే.. చీప్ లిక్క‌ర్‌ను రూ.70 కే ఇస్తామ‌ని.. ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డ్డాక చీప్ లిక్క‌ర్‌ను రూ.50కే ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అన్నారు.

ఈ ఒక్క వ్యాఖ్యే ఇప్పుడు కోట్ల మంది ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌స్తోంది. బీజేపీని అధికారంలోకి తీసుకువ‌స్తే.. త‌మ కుటుంబాలు నాశ‌నం అయిపోవ‌డం ఖాయ‌మ‌ని పేద‌లు అంటుంటే.. అంత పెద్ద బీజేపీ ఎలాంటి అంశాలూ లేవ‌న్న‌ట్టుగా.. చీప్ లిక్క‌ర్ హామీ ఇచ్చి.. చీప్ పాలిటిక్స్ చేస్తోందా? అని మేధావులు ప్ర‌శ్నిస్తున్నారు. వాస్త‌వానికి బీజేపీ లిక్క‌ర్ వ్య‌తిరేక పార్టీ. అస‌లు ఈ విష‌యాన్ని అంటూ.. లిక్క‌ర్‌ను బ్యాన్ చేస్తామ‌ని కానీ, ప్రోత్స‌హిస్తామ‌ని.. కానీ.. ఆ పార్టీ నేత‌లు ఎక్క‌డా ప్ర‌స్తావించ‌రు. ఎందుకంటే.. ఇది సున్నిత‌మైన అంశం. ఇస్తామ‌ని.. అంటే.. మ‌హిళా ఓటు బ్యాంకు పోతుంది. దీనిని ఇవ్వ‌మ‌ని అంటే పురుష ఓటు బ్యాంకు దూర‌మ‌వుతుంది. సో.. దీనిని వారు ప్ర‌స్తావించ‌రు.

కానీ, సోము మాత్రం ఏ మూడ్‌లో ఉన్నారో తెలియ‌దు కానీ.. అనూహ్యంగా ఆయ‌న నోటి నుంచి ఈ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీపై ఆశ‌లు పెట్టుకున్న‌వారు కూడా ఇంకేముంది.. బీజేపీ వ‌స్తే.. చీప్ లిక్క‌ర్ ఇస్తార‌న్న మాట‌.. హోదా పోయింది.. పోల‌వ‌రం పోయింది.. రాజ‌ధాని పోయింది.. చివ‌ర‌కు మ‌న‌కు లిక్క‌రే మిగులుతుంద‌ని తేల్చారా? అని పెద‌వి విరుస్తున్నారు. సోము వ్యాఖ్య‌లు పార్టీకి మ‌రింత చేటు చేశాయ‌ని బీజేపీ నాయ‌కులు వేదిక‌పైనే గుస‌గుస‌లాడ‌డం గ‌మ‌నించిన పాత్రికేయులు కూడా మౌనంగా ఉన్నారు. మ‌రి ఈ ప‌రిణామం.. ఎలాంటి ఫ‌లితం ఇస్తుందో చూడాలి.