Begin typing your search above and press return to search.

నవ్వుల పాలైన చంద్రబాబు దీక్ష

By:  Tupaki Desk   |   30 Jun 2021 8:30 AM GMT
నవ్వుల పాలైన చంద్రబాబు దీక్ష
X
ఈమధ్య చంద్రబాబునాయుడు ఏమి మాట్లాడుతున్నారో ? ఏపని ఎందుకు చేస్తున్నారో కూడా తెలీకుండానే చేసేస్తున్నారు. మంగళవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 3 గంటల పాటు దీక్ష చేశారు. కరోనా వైరస్ బాధితులకు అండగా ఉండటం కోసమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాధన దీక్ష అని దీనికి పెద్ద బిల్డప్ ఇచ్చారు. 175 నియోజకవర్గాల్లోను దీక్షలు చేయాలని చెప్పిన చంద్రబాబు తాను మాత్రం కుప్పంకు వెళ్ళకుండా పార్టీ సెంట్రల్ ఆఫీసులో దీక్ష చేశారు.

దీక్ష చేయటం వరకు ఓకేనే కానీ చేసిన విధానం వల్లే చివరకు నవ్వుల పాలయ్యారు. ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వచ్చిన చంద్రబాబు మధ్యాహ్నం 1 ప్రాంతంలో దీక్షను ముగించేసి ఇంటికి వెళ్ళిపోయారు. అందుకనే ఉదయం టిఫిన్ తినేసి వచ్చి మధ్యాహ్నం మళ్ళీ భోజనం సమయానికి దీక్షను ముగించుకుని వెళ్ళిపోయారంటు మంత్రులు, వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారు.

దీక్ష ప్రారంభ సమయంలో ఓ గంటన్నరపాటు చంద్రబాబు మాట్లాడారు. తన ప్రసంగంలో మొదటినుండి చివరి వరకు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించటం, ప్రభుత్వం ఫెయిలైందని ఆరోపించటం తప్ప ఇంకేమీ లేదు. కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని చెప్పిన చంద్రబాబు టీడీపీ ప్రజలకు భరోసా ఇచ్చిందని చెప్పటమే పెద్ద జోక్. అసలు కరోనా సమయంలో జగన్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని నిలదీయటం కూడా విచిత్రంగానే ఉంది.

ప్రెస్ మీట్ పెట్టడం, పెట్టకపోవటం జగన్ వ్యక్తిగతమన్న కనీస ఇంగితం కూడా చంద్రబాబులో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. మీడియాతో మాట్లాడకపోతే, ప్రచారంలో ఉండకపోతే చంద్రబాబుకు నిద్రపట్టదు. కాబట్టి 24 గంటలూ చంద్రబాబు మీడియా ఫోకస్ లోనే ఉండాలని కోరుకుంటారు. అదే జగన్ విషయం చూస్తే మొదటినుండి మీడియాకు, ప్రచారానికి దూరమే. మొత్తంమీద రోజువారిగా ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలే మళ్ళీ సాధన దీక్షలో కూడా చేశారు.

చంద్రబాబు మాట్లాడిన తర్వాత మరో గంటపాటు ఇతర నేతలు మాట్లాడారు. అంతే సాధన దీక్ష అయిపోయిందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. ఉదయం టిపిన్, మధ్యాహ్న భోజనం మధ్యలో సుమారు 3 గంటలపాటు దీక్ష చేయటం చంద్రబాబుకు చెల్లిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తరహా దీక్ష జరగటం బహుశా ఇదే మొదటిసారేమో.