Begin typing your search above and press return to search.

ఊహించ‌ని రీతిలో అమిత్ షాకు భారీ రిలీఫ్‌!

By:  Tupaki Desk   |   19 Sep 2018 5:36 AM GMT
ఊహించ‌ని రీతిలో అమిత్ షాకు భారీ రిలీఫ్‌!
X
తెర వెనుక ఏం జ‌రిగిందో తెలీదు కానీ.. తెర మీద మాత్రం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా మీద చెర‌గ‌ని మ‌చ్చ‌లా ఉన్న సొహ్రాబుద్దీన్ షేక్ బూట‌క‌పు ఎన్ కౌంట‌ర్ వ్య‌వ‌హారం తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామంతో చెరిగిపోయింది. గుజ‌రాత్‌ రాష్ట్ర హోంమంత్రిగా వ్య‌వ‌హ‌రించిన కాలంలో అమిత్ షా మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన ఉగ్ర‌వాది సొహ్రాబుద్దీన్ సోద‌రుడు న‌యూముద్దీన్ షేక్ విస్మ‌య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తాను ఇచ్చిన‌ట్లుగా చెబుతున్న వాంగ్మూలం తాను ఇవ్వ‌నే ఇవ్వ‌లేదంటూ అడ్డం తిరిగేశారు. తాను అమిత్ షా పేరును..గుజ‌రాత్ పోలీసు అధికారి అభ‌య్ చూడాస్మా పేరును సీబీఐకి చెప్ప‌లేద‌న్న మాట‌ను చెప్ప‌టం తాజా సంచ‌ల‌నంగా మారింది. తాజా ప‌రిణామంతో అమిత్ షా మీద ఉన్న సొహ్రాబుద్దీన్ మ‌చ్చ పూర్తిగా తొలిగిపోయిన‌ట్లేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇంత‌కూ సొహ్రాబుద్దీన్ వ్య‌వ‌హారం ఏమిటి? అస‌లేం జ‌రిగింద‌న్న‌ది చూస్తే.. 2005 న‌వంబ‌రు 23న సొహ్రాబుద్దీన్‌.. ఆయ‌న భార్య కౌస‌ర్ బీ.. అనుచ‌రుడు తుల‌సీరామ్ ప్ర‌జాప‌తితో క‌లిసి హైద‌రాబాద్ నుంచి మ‌హారాష్ట్రలోని సాంగ్లికి ఒక బ‌స్సులో బ‌య‌లుదేరారు. దారి మ‌ధ్య‌లో గుజ‌రాత్‌.. రాజ‌స్థాన్ ల‌కు చెందిన పోలీసులు వారిని బ‌స్సు నుంచి దింపి గుర్తు తెలియ‌ని ప్ర‌దేశానికి తీసుకెళ్లారు.

ఇది జ‌రిగిన మూడు రోజుల త‌ర్వాత అహ్మాదాబాద్ శివార్ల‌లో జ‌రిగిన ఒక ఎన్ కౌంట‌ర్లో సొహ్రాబుద్దీన్ చ‌నిపోయిన‌ట్లు చెప్పారు. త‌ర్వాత కౌస‌ర్ బీ కూడా గుజ‌రాత్ పోలీసులు చంపేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీరిద్ద‌రితో పాటు ప్ర‌జాప‌తిని కూడా చంపార‌న్న మాట ఉంది. ఈ మొత్తం వ్య‌వ‌హారం వెనుక నాటి గుజ‌రాత్ హోంమంత్రి అమిత్ షా పాత్ర ఉన్న‌ట్లుగా సొహ్రాబుద్దీన్ సోద‌రుడు న‌యూముద్దీన్ ఆరోపించారు.

ఈ వ్య‌వ‌హారం ఏళ్ల‌కు ఏళ్లుగా సాగుతోంది. ఇదిలా ఉంటేఈ మ‌ధ్య‌నే ఈ వ్య‌వ‌హారంలో అమిత్ షాకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇలాంటివేళ‌లో.. తాజాగా స్రొహాబుద్దీన్ సోద‌రుడు న‌యూముద్దీన్ తాజాగా మాట్లాడుతూ.. తాను అమిత్ షా పేరును.. అప్ప‌టి గుజ‌రాత్ పోలీసు అధికారి అభ‌య్ చూడాస్మా పేరును తాను చెప్ప‌న‌ప్ప‌టికీ త‌న వాంగ్మూలం కింద తీసుకున్నార‌ని వ్యాఖ్యానించారు. దీంతో.. అమిత్ షా మీద న‌కిలీ ఎన్ కౌంట‌ర్ జ‌రిపార‌న్న మ‌చ్చ తాజా మాట‌తో తొలిగిన‌ట్లుగా చెబుతున్నారు. ఇన్నేళ్లుగా షా మీద ఆరోప‌ణు చేసిన న‌యూముద్దీన్ ఉన్న‌ట్లుండి ప్లేటు మార్చేయ‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌వ‌ర్ తో ఎవ‌రు మాత్రం పెట్టుకోగ‌ల‌రు? అన్న మాట నిజ‌మేనా?