Begin typing your search above and press return to search.

హమ్మయ్య... 500 వస్తోంది

By:  Tupaki Desk   |   9 Dec 2016 6:29 AM GMT
హమ్మయ్య... 500 వస్తోంది
X
పనిచేసే ఏటీఎం ఎక్కడుందా అని నాలుగైదు గంటల పాటు తిరిగి.. తీరా అలాంటిది కనిపించాక అక్కడ మరో రెండుమూడు గంటలు లైన్లో నిలబడితే.. అదృష్ఠం బాగుంటే మన టర్ను వచ్చేవరకు ఏటీఎంలో డబ్బు ఉంటుంది... అప్పుడు ఒక 2 వేల రూపాయల నోటు దొరుకుతుంది. ఇక అక్కడ నుంచి కొత్త కష్టాలు షురూ. ఆ 2 వేల నోటును మార్చుకోవడానికి లక్ష కష్టాలు. ఎవరిని అడిగినా పెదవి విరుపే. కనీసం వెయ్యి రూపాయల సరకు కొంటేకానీ 2 వేలకు చిల్లర ఇచ్చే పరిస్థితి లేదు. 2 వేల నోటు తరువాత మళ్లీ 100 నోటే ఉండడంతో భారీ గ్యాప్ ఏర్పడి చిల్లర కష్టాలు దారుణంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అందరికీ అలవాటుగా మారిపోతున్న ఈ కష్టాల నుంచి కాస్త ఉపశమనం దొరకబోతోంది. మరో ఆరు రోజుల్లో కొత్త 500 నోట్లు రానున్నాయి. అవి వస్తే కాస్త ఇబ్బందులు తీరే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా కొత్త 500 నోట్లు విస్తృతంగా అందుబాటులోకి రాబోతున్నాయి. ఈనెల 15 నుంచి అవి భారీగా బ్యాంకులకు, ఏటీఎంలకు చేరనున్నాయి. ప్రతి రోజూ 5వేల కోట్ల రూపాయలను అందుబాటులో ఉంచుతామని ఆర్బీఐ ప్రకటించింది.

ప్రస్తుతం అటు బ్యాంకుల్లోనూ, ఇటు ఏటీఎంల్లోనూ కొత్త 2000 రూపాయల నోట్లు మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉండటంతో వినియోగ దారులనుంచి భారీ ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యను కొత్త రూ. 500 నోట్ల విడుదలతో పరిష్కరించాలని ఆర్బీఐ నిర్ణయించింది.

మరోవైపు శనివారం (రేపటి) నుండి బ్యాంకులకు మూడు రోజుల పాటు వరస సెలవులు వస్తుండడంతో జనం కష్టాలు రెట్టింపు కానున్నాయి. తిరిగి బ్యాంకులు తెరుచుకొనే నాటికి నగదు మరింతగా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 10 తేదీన రెండవ శనివారం, 11వ తేదీ ఆదివారం, 13వ తేదీ మిలాద్‌నబీ కారణంగా మూడు రోజుల పాటు బ్యాంకులు, ఏటీఎంలు తెరుచుకొనే అవకాశం లేదు.