Begin typing your search above and press return to search.

టీడీపీకి అరలక్ష... బీజేపీ వాటా ఎంత... ?

By:  Tupaki Desk   |   7 Oct 2021 1:32 PM GMT
టీడీపీకి అరలక్ష... బీజేపీ వాటా ఎంత... ?
X
ఏపీలో చూసుకుంటే రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీలు వేరైనా రాజకీయం ఒక్కటే కదా అన్నట్లుగా తీరు కనిపిస్తోంది. కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల గోదాలోకి బీజేపీ దూకేసింది. సరే పోటీకి రెడీ అయింది, అభ్యర్ధిగా పనతల సురేష్ ని ప్రకటించేసింది. మరి బీజేపీకి అక్కడ ఉన్న సీన్ ఎంత, స్కోప్ ఎంత అన్నదే ఇపుడు చర్చగా ఉంది. నిజానికి ఈ సురేష్ కూడా బద్వేల్ వాసి కాదు, ఆయన రైల్వే కోడూరు కు చెందిన వారు. అంటే గట్టిగా చెప్పాలంటే బద్వేల్ కి ఆయన కొత్త క్యాండిడేట్ కిందనే లెక్క. మరి సురేష్ కి లోకల్ గా బలం లేదు. బీజేపీకి సీన్ అంతంత మాత్రమే. ఈ నేపధ్యంలో ఈసారి బస్తీ మే సవాల్ అంటూ తొడకొడుతున్న బీజేపీకి ఎవరు హెల్ప్ చేస్తారు, కనీస స్థాయిలో అయినా ఓట్లు వస్తాయా అన్న చర్చ అయితే ఉంది.

ఇదిలా ఉండగా బీజేపీ ఎన్నికల్లో పోటీ చేయడం వెనక పెద్ద ఎత్తుగడే ఉందని అంటున్నారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి కేవలం అచ్చంగా 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక అదే ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 95, 482 ఓట్లు వచ్చాయి. అంటే ఎక్కడ వైసీపీ మరెక్కడ వైసీపీ అన్నట్లుగా సీన్ ఉంది. మరి ఈ మధ్యలో ఎంతో గ్యాప్ ఉంది. దానిని అధిగమించేందుకు పూర్తిగా టీడీపీ ఓటు బ్యాంక్ మీదనే ఆధారపడుతున్నట్లుగా తెలుస్తోంది.

టీడీపీకి గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో సైతం 50,748 ఓట్లు వచ్చాయి. మరి ఈసారి టీడీపీ పోటీ చేయడం లేదు అంటే ఆ ఓట్లను తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది అంటున్నారు. ఈ విషయంలో మాజీ తమ్ముళ్ళు, ప్రస్తుతం బీజేపీలో కీలక నేతలు అయిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డిలతో కాగల కార్యం నెరవేర్చుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఈ ఇద్దరు నేతలకు నేరుగా టీడీపీ అధినాయకత్వంతోనే మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ ఓట్లు బీజేపీ వైపు మళ్ళీలా చేయడానికి గట్టిగానే కసరత్తు జరుగుతోంది అంటున్నారు.

అంటే ఏమీ కాదు, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీతో పోటీ ఏంటి అని వైసీపీ అనుకుంటే తప్పు అన్న మాటనే ఈ ఉప ఎన్నిక నిరూపించబోతోంది అంటున్నారు. బద్వేల్ లో ఎటూ జనసేన ఓట్లు బీజేపీకి టర్న్ అవుతాయని అనుకుంటున్నారు. దాంతో టీడీపీకి ఉన్న అరలక్ష ఓట్లను కూడా తమ వైపునకు తిప్పుకుంటే వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీకి అవకాశం ఉంటుంది. మరి ఇలా తెర వెనక అవగాహన కుదిరిందని, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో టీడీపీ శ్రేణుల నుంచి బీజేపీకి మద్దతు దక్కుతోంది అంటున్నారు. మరి ఈ అవగాహన రేపటి రోజున ఏపీలో బీజేపీ టీడీపీల మధ్య కొత్త పొత్తుకు పునాది అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు.