Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త కూటమి.. టీడీపీ నేతల్లో గుబులు?

By:  Tupaki Desk   |   11 Oct 2021 2:21 PM GMT
ఏపీలో కొత్త కూటమి.. టీడీపీ నేతల్లో గుబులు?
X
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అటుఇటుగా రెండున్నరేళ్లు కావస్తోంది. అయితే ఇప్పటికే ఎన్నికల ఫీవర్ రాష్ట్రంలో మొదలైంది. విపక్షాలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లాయి. రాజకీయ సమీకరణలు, వ్యూహాలను పదును పెడుతున్నారు. రాష్ట్రంలో తిరిగి వైసీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కూటమి కడుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీలో కూటమిగా ఏర్పడుతాయనే ప్రచారం ఊపందుకుంది. ఏపీ విభజన జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్, అనధికారికంగా టీడీపీ మద్దుతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పవన్ సాయంతోనే అధికారంలోకి వచ్చామని టీడీపీ నేతలు ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలంటే ఒంటరి వెళ్తే ప్రయోజనం ఉండదనే భావనలో టీడీపీ నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే జనసేన, బీజేపీతో కలిసి పనిచేస్తోంది. జనసేన, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడితే బీజేపీ పరిస్థితి ఏమిటనే అనుమానం రావచ్చు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పట్టుమని పది స్థానాల్లో కూడా ఆ పార్టీ విజయం సాధించలేదు. అందువల్ల ఆ పార్టీతో పొత్తుపెట్టుకుంటే పెద్దగా ప్రయోజనం ఉందనే భావనలో టీడీపీ, జనసేన ఉన్నట్లు తెలుస్తోంది. పైగా మూడు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తే సీట్ల సర్ధుపాటు కూడా సమస్యగా మారే అవకాశం ఉందనే వాదన ఒకటి వినిపిస్తోంది. అందువల్ల వచ్చే ఎన్నికల నాటికి జనసేన, టీడీపీ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనే వార్తలు కొంతకాలం విన్పిస్తున్నాయి.

ఇటీవల పవన్ తన సమాజికవర్గాన్ని ఏకం చేసేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. కాపు సమాజికవర్గానికి దగ్గర అయ్యేందుకు పవన్ పావులు కదుపుతున్నారు. కాపు సామాజికవర్గంపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చుతున్నాయి. కాపులను ఆకట్టకునేందుకు.. కాపు రిజర్వేషన్‌పై పవన్ గళమెత్తుతారని జనసేన నేతలు చెబుతున్నారు. జిల్లాల వారిగా కాపులతో సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలని జనసేన వ్యూహం రచిస్తోందని తెలుస్తోంది.

గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గం వైసీపీ మద్దతుగా నిలిచింది. దీంతో ఆ సామాజికవర్గ ఓట్లు టీడీపీ పడలేదని చెబుతున్నారు. మిగిలిన కొందరి ఓట్లు జనసేన ఖాతాలో పడ్డాయి. ఈ వర్గాన్ని సొంతం చేసుకుని, పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకునేందుకు జనసేన ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ పరిణామాలను గమనించిన టీడీపీ, జనసేనతో 'సై' అంటోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ టీడీపీకి మరో సమస్య ఎదురవుతోంది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే అత్యధిక సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉందనే గుబులు టీడీపీలో మొదలైందనే ప్రచారం జరుగుతోంది.