Begin typing your search above and press return to search.

పీఓకే పై కొత్త ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   11 Jan 2020 10:30 AM GMT
పీఓకే పై కొత్త ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు !
X
జమ్ముకశ్మీర్‌ కు సంబంధించిన ఆర్టీకల్ 370ను ఆగష్టు 5న రద్దు చేసినప్పటి నుంచి.. దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా.. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, మిగిలిన మంత్రులు పీఓకే(పాక్ ఆక్రమిత కశ్మీర్) మాదంటూ చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. దాదాపు 70 సంవత్సరాల క్రితం కశ్మీర్‌కు చెందిన ఓ భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకొని.. ఆజాద్ కశ్మీర్ అని పేరు పెట్టి పరిపాలిస్తున్నారు. ఇక 1971లో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం జరిగిన తరువాత, ఇరు దేశాల మధ్య సిమ్లా అగ్రిమెంట్ జరిగినా పీఓకే మాత్రం మనకు రాలేదు.

ఇకపోతే ఈ పీఓకే పై తాజాగా ఆర్మీ చీఫ్ గా ఎంపికైన ముకుంద్ నరవనే కీలక వ్యాఖ్యలు చేసారు. పీఓకే మనదేనని, ఆపరేషన్ పీఓకే నిర్వహించేందుకు తాము సిద్ధమేనని అయన ప్రకటించారు. నెలవారీ ప్రెస్‌ మీట్‌ లో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ, పీఓకే వెనక్కి తెచ్చుకోవాలని పార్లమెంటు నిర్ణయిస్తే.. ఆ ప్రాంతం కూడా మనదే అవుతుంది అని అన్నారు. ఆ మేరకు తమకు ఎప్పుడు ఉత్తర్వులు అందితే అప్పుడు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఎల్ఓసీ వద్ద పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల నుంచి ఎదురవుతున్న ముప్పును ఆర్మీ చీఫ్ ప్రస్తావిస్తూ, ఎల్ఓసీ వెంబడి అత్యంత అప్రమత్తత పాటిస్తున్నామన్నారు. ప్రతిరోజూ ఇంటెలిజెన్స్ అలెర్ట్‌లు అందుతుంటాయని, చాలా సీరియస్‌గానే వీటిని పరిగణించి పాకిస్థాన్ ప్రత్యేక బలగాలైన 'బ్యాట్' చర్యలకు ప్రతిచర్యలు చేపడుతూ వాటిని సమర్ధవంతంగా తిప్పికొడుతుంటామని చెప్పారు. భారత ఆర్మీ ప్రాధాన్యతలపై మాట్లాడుతూ, చొరబాట్లను తిప్పికొట్టడం తాత్కాలిక ప్రాధాన్యతాంశమైతే, సాంప్రదాయ యుద్ధం అనేది దీర్ధకాలిక ప్రాధాన్యతాంశం అవుతుందని, అందుకు తాము సన్నద్ధం గా ఉంటామని చెప్పారు.