Begin typing your search above and press return to search.

పాల‌మూరు కాంగ్రెస్‌లో కొత్త ర‌క్తం..!

By:  Tupaki Desk   |   25 Jan 2022 12:30 AM GMT
పాల‌మూరు కాంగ్రెస్‌లో కొత్త ర‌క్తం..!
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా నుంచి కొత్త నేత‌లు తెర‌పైకి రానున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో యువ నేత‌లు బ‌రిలో ఉండ‌నున్నారు.

రేవంత్ రెడ్డి పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టాక పార్టీలో నూత‌న ర‌క్తానికి అవ‌కాశం ఇస్తున్నారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సీనియ‌ర్ నేత‌ల స్థానంలో ద్వితీయ నేత‌ల‌ను.. యువకుల‌ను.. విద్యావేత్త‌ల‌ను.. ఉత్సాహ‌వంతుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ముందుకు దూసుకెళుతున్నారు.

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ సారి అవ‌కాశం ద‌క్కించుకునేందుకు కొత్త‌, యువ నేత‌లు, సీనియ‌ర్ నేత‌ల వార‌సులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఒక‌వైపు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కార్య‌క్ర‌మాల్లో.. సొంత ట్ర‌స్టులు.. యువ సేన‌ల పేరుతో సామాజిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు దాదాపు రెండేళ్ల స‌మ‌యం ఉండ‌డంతో ఇప్ప‌టి నుంచే త‌మ కార్య‌క్ర‌మాలు తీవ్ర‌త‌రం చేస్తున్నారు. మ‌రోవైపు అధిష్ఠానం తో సంప్ర‌దింపులు జ‌రుపుతూ టికెట్ల కోసం ఇప్ప‌టి నుంచే క‌ర్చీఫ్ వేసుకుంటున్నారు.

వ‌న‌ప‌ర్తి అసెంబ్లీ స్థానం నుంచి యువ‌జ‌న కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడు శివ‌సేనారెడ్డి. జ‌డ్చ‌ర్ల నుంచి పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ అనిరుధ్ రెడ్డి, షాద్ న‌గ‌ర్ నుంచి పీసీసీ కార్య‌ద‌ర్శి వీర్ల‌ప‌ల్లి శంక‌ర్‌, దేవ‌ర‌క‌ద్ర నుంచి పీసీసీ కార్య‌ద‌ర్శి మ‌ధుసూద‌న్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి ఇటీవ‌లే పార్టీలో చేరిన అభిలాష్ రావు, మ‌క్త‌ల్ నుంచి జ‌లంధ‌ర్ రెడ్డి, నారాయ‌ణ‌పేట నుంచి శివ‌కుమార్ రెడ్డి, నాగ‌ర్ క‌ర్నూల్ నుంచి మాజీ మంత్రి నాగం జ‌నార్ద‌న్ రెడ్డి త‌న‌యుడు శ‌శిధ‌ర్ రెడ్డి ఆశావ‌హుల జాబితాలో ముందు వ‌రుస‌లో ఉన్నారు. వీళ్లు ఇటు పార్టీ కార్య‌క్ర‌మాల‌తో పాటు స‌మాంత‌రంగా సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

ఆశావ‌హుల్లో చాలా మంది 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే పోటీకి ఉత్సాహం చూపినా ప‌లు కార‌ణాల‌తో అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు. ఈ ద‌ఫా ఎలాగైనా టికెట్ సాధించి అసెంబ్లీ లో తొలిసారి అడుగుపెట్టాలని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. వీరే కాకుండా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీనియ‌ర్ నేత‌ల త‌న‌యులు.. బంధువులు పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు.

వీరిలో రేవంత్ వ‌ర్గం మ‌ద్దతు ఎవ‌రికి ఉందో.. ఇత‌ర సీనియ‌ర్ నేత‌ల అభ్యంత‌రాలు ఎలా ఉంటాయో.. అధిష్ఠానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో.. వేచి చూడాలి.