Begin typing your search above and press return to search.

టీడీపీ కంచుకోటలో ఈసారి కొత్త అభ్యర్థి!

By:  Tupaki Desk   |   31 Dec 2022 5:14 AM GMT
టీడీపీ కంచుకోటలో ఈసారి కొత్త అభ్యర్థి!
X
టీడీపీకి కంచుకోట అనదగ్గ నియోజకవర్గాల్లో ఒకటి.. నందిగామ. గతంలో కృష్ణా జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం ప్రస్తుతం ఎన్టీఆర్‌ జిల్లాలో చేరింది. 1983లో టీడీపీ ఏర్పడిన తర్వాత నందిగామ నియోజకవర్గంలో కేవలం మూడుసార్లు మాత్రమే ఓడిపోయింది. 1985, 1994, 1994, 2004, 2009, 2014 ఇలా ఆరుసార్లు టీడీపీ ఘనవిజయం సాధించింది. వంగవీటి హత్య జరిగాక జరిగిన 1989 ఎన్నికలోనూ, వైసీపీ గాలి వీచిన 2019 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ ఓడిపోయింది.

అలాంటి కీలక నియోజకవర్గంలో ఈసారి టీడీపీ తరఫున కొత్త అభ్యర్థి బరిలోకి దిగుతారని టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం అమరావతి రైతుల తరఫున కీలక పోరాటం చేస్తున్న కొలికిపూడి శ్రీనివాసరావుకు నందిగామ నుంచి టికెట్‌ ఇస్తారని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆమోదముద్ర వేసినట్లు చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.

ముఖ్యంగా నందిగామ నియోజకవర్గంలో టీడీపీకి పూర్తి పట్టు ఉంది. కమ్మ సామాజికవర్గం అత్యధిక సంఖ్యలో ఉంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి దేవినేని వెంకట రమణ, ఆయన మరణించాక ఆయన సోదరుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చాలాకాలం ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. 2009లో నందిగామ ఎస్సీ రిజర్వుడ్‌ అయ్యింది. అప్పుడు కూడా టీడీపీనే గెలిచింది. టీడీపీ తరఫున తంగిరాల ప్రభాకరరావు గెలుపొందారు. 2014లోనూ ఆయనే మరోమారు విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆయన మృతి చెందడంతో ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య విజయం సాధించారు. 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్‌ రావు ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే తంగిరాల సౌమ్య కంటే కొలికిపూడి శ్రీనివాసరావు అయితే గట్టి అభ్యర్థి అవుతారని టీడీపీ భావిస్తోంది. కొలికిపూడి శ్రీనివాసరావు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. అంతేకాకుండా కొలికిపూడి ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు.

అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రైతుల గొంతుకగా కొనసాగుతున్నారు. అలాగే రైతుల తరఫున అనేక టీవీ షోలలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఒక టీవీ లైవ్‌ షోలో బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డిని చెప్పుతో కొట్టి కొలికిపూడి పాపులర్‌ అయ్యారు.

ఈసారి టీడీపీ టికెట్‌ ను తంగిరాల సౌమ్యకు ఇవ్వకుండా కొలికిపూడికి టికెట్‌ ఇస్తారని చెబుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైసీపీ అధినేత మొండితోక జగన్మోహన్‌ రావుపై పోటీ చేసేందుకు కొలికిపూడి సరైన అభ్యర్థి అని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. వైసీపీ విమర్శలను ఆయనైతే సమర్థంగా ఎదుర్కోగలరని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కొలికిపూడికి ప్రజలను ఒప్పించగల తెలివి ఉందని అంటున్నారు. పైగా అమరావతి రైతులందరూ ఆయనకు ఓటు వేస్తారనే నమ్మకంతో టీడీపీ ఉంది. ప్రతి రోజూ ఉదయాన్నే టీవీల్లో రాజకీయ చర్చల్లో పాల్గొని కొలికిపూడి ఫేమస్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో తమ కంచుకోటలో కొలికిపూడికి సీటు ఇస్తే ఆయన విజయం సాధించడం ఖాయమని టీడీపీ శ్రేణులు కూడా విశ్వసిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.