Begin typing your search above and press return to search.

తెలంగాణ లో కొత్త ఛైర్మన్లు.. మేయర్ల ఎన్నిక డేట్ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   24 Jan 2020 4:41 AM GMT
తెలంగాణ లో కొత్త ఛైర్మన్లు.. మేయర్ల ఎన్నిక డేట్ ఇచ్చేశారు
X
పుర ఎన్నికల హడావుడి ఒక కొలిక్కి వచ్చినట్లే. బుధవారం జరిగిన పోలింగ్ లో హైదరాబాద్ శివారు మినహాయిస్తే.. మిగిలిన అన్నిచోట్ల ఒక మోస్తరు నుంచి భారీగానే పోల్ అయ్యాయి. కార్పొరేషన్లు పోలిస్తే.. మున్సిపాలిటీల్లోనే పోలింగ్ శాతం మెరుగ్గా ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు 25న (శనివారం) వెల్లడి కానుంది. ఇదిలా ఉండగా.. మున్సిపాలిటీలకు ఛైర్మన్లు.. కార్పొరేషన్ల కు మేయర్ల ను ఎన్నిక చేసుకునేందుకు వీలుగా డేట్స్ ను ఫిక్స్ చేశారు.

చేతులెత్తటం ద్వారా ఛైర్మన్.. మేయర్లను ఎంపిక చేసే విధానం అమల్లో ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేశారు. దీని ప్రకారం ఈ నెల 27న ఛైర్మన్లు.. మేయర్ల ను ఎంపిక చేయనున్నారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు.. కార్పొరేటర్లు ఆయా పురపాలక.. కార్పొరేషన్ కార్యాలయాల్లో జరిగే ఎన్నిక కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది. 27 ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు ఎన్నికను నిర్వహిస్తారు.

ఈ ఎన్నికను నిర్వహించేందుకు వీలుగా ఆయా జిల్లాల కలెక్టర్లు నియమించిన అధికారులు ఈ నెల 25న నోటీసు జారీ చేయనున్నారు. ఛైర్మన్.. మేయర్లను ఎంపిక చేయటానికి అవసరమైన కోరం ఉండాల్సిందే. ఒక సభ్యుడు పేరును ప్రతిపాదిస్తే మరొకరు బలపర్చాల్సి ఉంటుంది. ఒకవేళ పార్టీకి చెందిన అభ్యర్థి అయితే.. సంబంధిత పార్టీ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని ఈ ఎన్నికను నిర్వహించే అధికారికి అందించాల్సి ఉంటుంది. పోటీలో ఒకరే ఉంటే ఏకగ్రీవంగా ఎంపిక చేస్తారు. ఒకవేళ.. ఇద్దరు పోటీ పడితే.. సభ్యులు చేతులెత్తటం ద్వారా.. తుది ఫలితాన్ని నిర్ణయిస్తారు.

ఇక.. ఈ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు గా ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు తమ ప్రాధాన్యతను ఈ నెల 25న నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే.. తమ అవసరం ఎక్కడ ఉందో చూసుకొని.. వారు తమ పేర్లను ఆయా మున్సిపాలిటీ.. కార్పొరేషన్లలో నమోదు చేసుకోనున్నారు. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం రాష్ట్రంలోని అత్యధిక మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లు అధికార టీఆర్ఎస్ ఖాతాలోనే పడనున్నాయి.