Begin typing your search above and press return to search.

ఏపీ కాంగ్రెస్ కు కొత్త చీఫ్: ఎవరంటే..?

By:  Tupaki Desk   |   11 Dec 2021 4:30 PM GMT
ఏపీ కాంగ్రెస్ కు కొత్త చీఫ్: ఎవరంటే..?
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కాంగ్రెస్ ను పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఈ పార్టీలో ఉన్న నాయకులు ఎవరి దారు వారు చూసుకోవడంతో పార్టీకి దిక్కులేకుండా పోయింది. అయితే తెలంగాణలో పీసీసీ పాలకవర్గం రేవంత్ రెడ్డి టీంకు అప్పగించిన తరువాత కాస్త మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

కానీ ఏపీలో మాత్రం పూర్తిగా కనుమరుగైందా..? అన్నట్లు చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీలో ఉండడానికి నాయకులుసైతం ముందుకు రావడం లేదు. దీంతో ఏపీ పార్టీకి కొత్త చీఫ్ ను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత కాంగ్రెస్ ప్రతీ ఎన్నికల్లో ఓడిపోతూ వస్తోంది. 2019 ఎన్నికల్లో కనీస సీట్లు కూడా గెలువలేకపోయింది. ఇటీలవ జరిగిన బద్వేల్ ఎన్నికల్లో 6,250 ఓట్లు రావడంతో ఇక పార్టీ మనుగడ కొనసాగేనా..? అని చర్చించుకుంటున్నారు. ఏపీ కాంగ్రస్ కు అధ్యక్షుడు, ఇతర పాలకవర్గం ఉన్నప్పటికీ మీడియాలోనూ కనిపించడం లేదు.

దీంతో ఆ పార్టీ జెండా చూద్దామన్న కనిపించే స్థాయిలో లేదని అనుకుంటున్నారు. ప్రస్తుతం పార్టీ చీఫ్ గా శైలజానాథ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ కు రెడ్డి వర్గం కలిసివస్తుందన్న తరహాలో తెలంగాణలో రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పారు. ఇప్పుడు ఏపీలోనూ రెడ్డి సామాజిక వర్గానికి బాధ్యతలు అప్పగిస్తారా..? అన్న చర్చ సాగుతోంది.

మరో రెండు, మూడేళ్లలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడున్న వైసీపీపైవ్యతిరేకత వస్తోందని అటు టీడీపీ, బీజేపీలు ఏదో ఒక కార్యక్రమంలో ఉంటూ మనుగడ సాధిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

రాష్ట్రస్థాయిలోనే నాయకత్వ లేమి కనిపించడంతే జిల్లా, మండల స్థాయి నాయకులు జెండాను పట్టుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లోగా పార్టీని గాడిలో పెట్టేందుకు స్వయంగా రాహుల్ గాంధీ ఏపీపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 21,22 తేదీల్లో కాంగ్రెస్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఏపీకి కొత్త చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ఏపీ ఇన్ చార్జి జనరల్ సెక్రటరీ ఉమన్ చాందీ ఇప్పటికే పలువురితో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నేతలందరినీ విజయవాడకు రావాలని ఉమెన్ చాందీ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో రాహుల గాంధీ ఇక్కడి పరిస్థితిని చూసి పీసీసీ చీఫ్ ను ప్రకటిస్తారని చర్చించుకుంటున్నారు.

అయితే ఇప్పుడున్న నాయకుల్లో ఎవరికి పదవి వర్తిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం కొత్త వారికి అవకాశం ఇస్తుందా..? లేక అనుభవం ఉన్నవారిని చూజ్ చేసుకుంటుందా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకుల్లో కాస్త ఉత్సాహం కలిగినట్లు తెలుస్తోంది.

అయితే వచ్చేవారెవరైనా కనీసం రెండో స్థానానికి తీసుకొచ్చేలా ప్రయత్నించాలని కోరుకుంటున్నారు. నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత కాంగ్రెస్ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. నామరూపాల్లేకుండా జెండాలు మూలన పడ్డాయి. దీంతో కొత్త చీఫ్ ఎలాంటి వారు వస్తారోనన్న ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అధిష్టానం మాత్రం తెలంగాణ మాదిరిగి గట్స్ ఉన్న వ్యక్తి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఇతర పార్టీల నుంచి తీవ్ర ఒత్తిడి తట్టుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ పటిష్టతకు కృషి చేసే వ్యక్తి కోసం సెర్చ్ చేస్తున్నారు. కొందరు పార్టీ చీఫ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న అధిష్టానం మదిలో మాత్రం వేరేరకంగా ఉంటుందని నాయకులు చర్చించుకుంటున్నారు.