Begin typing your search above and press return to search.

రాజ‌ధాని రైతుల్లో నేల‌పాడు రైతులు వేర‌యా?

By:  Tupaki Desk   |   19 Oct 2015 9:01 AM GMT
రాజ‌ధాని రైతుల్లో నేల‌పాడు రైతులు వేర‌యా?
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి సంబంధించి అతి కీల‌క‌మైన అంశాల్లో అధికారులు క‌క్కుర్తి.. ఏపీ స‌ర్కారుకు కొత్త త‌ల‌నొప్పులు తేనుంది. ఖ‌ర్చు విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తూనే.. అవ‌స‌ర‌మైన విష‌యాల్లో ఖ‌ర్చు గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అలాంటి నిర్ణ‌యాల్లో ఒక‌టి.. రాజ‌ధాని నిర్మాణానికి త‌మ భూములు ఇచ్చిన రైతుల‌కు ప‌ట్టువ‌స్త్రాలు.. స్వీట్ బాక్స్ ఇచ్చి ఆహ్వానిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే.. ప‌ట్టువ‌స్త్రాలు.. స్వీటు బాక్సు విష‌యంలో అధికారులు చేసిన ప‌నుల‌కు రాజ‌ధాని రైతులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. ప‌ట్టువ‌స్త్రాలు ఇచ్చి.. స్వీటు బాక్సు చేతిలో పెట్టి.. శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి త‌ప్ప‌నిస‌రిగా రావాలంటూ రైతుల‌ను ఏపీ మంత్రులు ఆహ్వానించ‌టం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మాన్ని తొలుత నేల‌పాడులో నిర్వ‌హించారు. ఆ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌టంతో పాటు.. రైతుల‌కు రూ.2300 విలువ చేసే వ‌స్త్రాల్ని ఇచ్చారు. దీంతో రైతుల ముఖాలు వెలిగిపోయిన ప‌రిస్థితి.

అయితే.. నేల‌పాడు రైతుల‌కు ఇచ్చిన రీతిలో మిగిలిన గ్రామాల్లో పంపిణీ చేస్తున్న ప‌ట్టువ‌స్త్రాలు నాణ్య‌త లేవ‌ని.. నాసిర‌కంగా ఉంటున్నాయ‌న్న ఫిర్యాదులు చేస్తున్నారు. మ‌రికొంద‌రు రైతులు అయితే.. అధికారులు ఇచ్చిన వ‌స్త్రాల్ని వెన‌క్కి ఇచ్చేస్తున్నారు. రూ.2300 అని చెబుతున్నా రూ.700 కూడా విలువ చేయ‌మ‌ని.. వ‌డియాలు పెట్టుకోవ‌టానికి కూడా ఈ చీర‌లు ప‌నికిరావంటూ తిట్టేస్తున్నారు. నేల‌పాడు గ్రామ రైతుల‌కు స్వీటు బాక్స్ ఇచ్చి.. త‌మ‌కు ఎందుకు ఇవ్వ‌టం లేద‌ని నిల‌దీస్తున్నారు.

తుళ్లూరు మండ‌లంలోని తుళ్లూరు.. అనంత‌వ‌రం.. అబ్బ‌రాజుపాలెం.. రాయ‌పూడి గ్రామాల రైతులు అయితే ప్ర‌భుత్వం త‌మ‌కు ఇస్తున్న ప‌ట్టువ‌స్త్రాలు అక్క‌ర్లేద‌ని తేల్చి చెప్ప‌టంతో కంగుతిన్న అధికారులు.. నాణ్య‌త‌తో కూడిన వ‌స్త్రాలు ఇస్తామంటూ తీసుకెళుతున్నార‌ని చెబుతున్నారు. అధికారుల క‌క్కుర్తి కార‌ణంగానే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయ‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌పెద్ద కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌డుతున్న ఏపీ స‌ర్కారు సైతం.. ఇలాంటి త‌ప్పులు దొర్ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. లేదంటే.. అన‌వ‌స‌రంగా అభాసుపాల‌య్యే అవ‌కాశ‌మే ఎక్కువ‌. త‌మ విలువైన భూముల్ని ఏపీ స‌ర్కారుకు ఇచ్చేసిన రైతులు రూ.2300 పెట్టి బ‌ట్ట‌లు కొనుక్కోలేనంత దుస్థితిలో ఉండ‌రు. స్వీటు బాక్స్ కొనుక్కోలేని ప‌రిస్థితుల్లో రాజ‌ధాని రైతులు లేర‌నే చెప్పాలి. ప్ర‌భుత్వం త‌మ‌ను గుర్తించి ఇస్తున్న కానుక ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ఉండేందుకే త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నామ‌ని చెబుతున్నారు. అధికారుల క‌క్కుర్తిని బాధ్య‌త క‌లిగిన మంత్రులు ఎందుకు ప‌ట్టించుకోవ‌టం లేదు..?