Begin typing your search above and press return to search.

కొత్త కరోనా వైరస్.. కుక్కల నుంచే వ్యాపించిందా?

By:  Tupaki Desk   |   22 May 2021 8:30 AM GMT
కొత్త కరోనా వైరస్.. కుక్కల నుంచే వ్యాపించిందా?
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎలా పుట్టిందో ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవు. ఎన్నో ప్రయోగాలు నిర్వహించినా వైరస్ మూలాలను కనుగొనలేకపోతున్నారు. ఏడాది కాలంలో ఇప్పటికే పలు రకాల కరోనా వైరస్ లు వ్యాపించాయి. అయితే ఈ తరహా వైరస్ లు విజృంభించడం కొత్తేమి కాదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం విజృంభిస్తున్న మహమ్మారి ప్రమాద తీవ్రతతో మృత్యు ఘంటికలు మోగిస్తోందని తెలిపారు.

మరో కొత్త కరోనా జాతిని మలేషియా పరిశోధకులు గుర్తించారు. అక్కడ నమోదైన పాజిటివ్ కేసుల్లో కెనైన్ కరోనా వైరస్ ఉందని నిర్ధారించారు. ఈ రకమైన వైరస్ కుక్కల్లో ఉంటుందని తెలిపారు. ఇది నేరుగా మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది అనడానికి ఆధారాలు లేవని చెబుతున్నారు. కుక్కలు, పిల్లులు, పందుల నుంచి వ్యాపిస్తుందని అన్నారు. న్యూమోనియా లక్షణాలు ఉంటాయని చెప్పారు.

న్యూమోనియా లక్షణాలతో బాధపడుతన్న కొంతమంది నుంచి సేకరించిన శాంపిల్స్ లో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. 301 మందిని పరిశీలించగా 8 మందిలో నమోదైందని పేర్కొన్నారు. ఈ వైరస్ శ్వాసకోశాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వెల్లడించారు. గతేడాదిలోనూ కొన్ని కేసులు నమోదైనట్లు వివరించారు.

ఈ కొత్త వైరస్ మనుషులకు ఎలా సంక్రమించిదో అనే దిశగా ప్రయోగాలు చేస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు. ఇది జంతువుల నుంచి మాత్రమే సోకుతుందని అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాల కాలంలో ఇలాంటి వైరస్ లు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. సార్స్ రకానికి చెందిన కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని వెల్లడించారు. మరి ఈ కొత్త వైరస్ ప్రభావం ఎంతవరకు ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని నిపుణులు అంటున్నారు.