Begin typing your search above and press return to search.

కొత్త కల్చర్.. కేసీఆర్ కాళ్లు మొక్కిన ఆ ఇద్దరు కలెక్టర్లు

By:  Tupaki Desk   |   21 Jun 2021 8:31 AM GMT
కొత్త కల్చర్.. కేసీఆర్ కాళ్లు మొక్కిన ఆ ఇద్దరు కలెక్టర్లు
X
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రోటీన్ కు భిన్నంగా ఆలిండియా ఆఫీసర్లు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్లకు మొక్కిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ నేతలపై కొందరు అధికారుల అభిమానం విధేయతగా మారిన వైనం విమర్శలకు కారణమవుతున్న వేళ.. అంతకు మించిన స్వామిభక్తిని ప్రదర్శించటం ఎలానో తాజాగా రెండు జిల్లాల కలెక్టర్లు తమ చేతల్లో చేసి చూపించారు.

సిద్దిపేట.. కామారెడ్డి జిల్లాల కలెక్టరేట్ భవనాల్ని ప్రారంభించిన సందర్భంగా ఆ జిల్లాల కలెక్టర్లు సీఎంకేసీఆర్ కాళ్లు మొక్కటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో.. ఇద్దరు కలెక్టర్లను ముఖ్యమంత్రి స్వయంగా వారి చాంబర్ లోని సీట్లలో కూర్చోబెట్టారు. అనంతరం వారు కేసీఆర్ కాళ్లకు పాదాలకు నమస్కారం చేశారు. సాధారణంగా కలెక్టర్లు ఆలిండియా అధికారులు. వారు రాజ్యాంగానికి బద్ధులై ఉండాలే తప్పించి.. వ్యక్తిగత భావోద్వేగాలకు ఏ మాత్రం కాదు. వారున్న కలెక్టర్ స్థానానికి ఇవ్వాల్సిన గౌరవం.. మర్యాదకు భంగం వాటిల్లకుండా అనునిత్యం జాగ్రత్తలు తీసుకోవాలి.

అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కాళ్లకు నమస్కారం చేసిన వైనం ఇప్పుడు అవాక్కుఅయ్యేలా చేసింది. ఈ విషయంలో మొదట వేలెత్తి చూపించాల్సింది కామారెడ్డి కలెక్టర్ శరత్ మీదనే. ఎందుకంటే.. పాదాభివందం మొదలు పెట్టింది ఆయనే. ఆ తర్వాత ఆయన బాటలోనే సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కూడా ఫాలో అయ్యారు. అయితే.. ఈ కాళ్లు మొక్కడాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో వెంకట్రామిరెడ్డి ‘పాదాభివందనం’పై వివరణ ఇచ్చారు. పెద్దావాళ్ల ఆశీర్వాదం తీసుకోవటం తెలంగాణ సంప్రదాయమని.. తెలంగాణ బిడ్డగా తెలంగాణ అధికారికగా.. నూతన కలెక్టరేట్ లో తనకు బాధ్యతలు అప్పగించి ఆశీర్వదిస్తున్న వేళలో తానీ పని చేశానని చెప్పారు. తండ్రి సమానులైన సీఎం నుంచి ఆశీస్సులు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందే సమయంలో ఫాదర్స్ డే కూడా కావటాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ విషయం మీద అనవసరమైన రాద్దాంతం తగదని హితవు పలికారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లోఈ విదేయత ఎంతవరకు వెళుతుందో చూడాలి.