Begin typing your search above and press return to search.

కన్యాకుమారిలో క‌ల‌క‌లం: ప‌‌రోటా కోసం జ‌నంలోకి వైర‌స్ బాధితుడు

By:  Tupaki Desk   |   19 July 2020 10:09 AM GMT
కన్యాకుమారిలో క‌ల‌క‌లం: ప‌‌రోటా కోసం జ‌నంలోకి వైర‌స్ బాధితుడు
X
వైర‌స్ బారిన ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో ప‌డుతుండ‌డంతో వారికి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌తో పాటు ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో చికిత్స అందించే ప‌రిస్థితి లేదు. వార్డుల‌న్నీ రోగుల‌తో నిండిపోయాయి.. బెడ్లు నిండుకున్నాయి. దీంతో వైర‌స్ బాధితుల‌కు ఇంట్లోనే ఉండి చికిత్స అందించేలా చేస్తున్నారు. అది కాని ప‌క్షంలో ప్ర‌భుత్వ‌మే వృథాగా.. ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను తీసుకుని వాటిలో వైర‌స్ బాధితుల‌కు చికిత్స అందిస్తున్న ప‌రిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా ఓ చికిత్స అందిస్తుండ‌గా.. ఓ వైర‌స్ బాధితుడు త‌న‌కు ప‌రోటా కావాల‌ని జ‌నాల్లోకి వ‌చ్చాడు. దీంతో అక్క‌డి స్థానికులు భ‌యాందోళ‌న వ్య‌క్తం చేశారు. అత‌డు బ‌య‌ట‌కు వ‌చ్చిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారింది. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి జిల్లాలో జ‌రిగింది.

ప్ర‌స్తుతం వైర‌స్ తీవ్రంగా ప్ర‌బ‌లుతున్న రాష్ట్రాల్లో త‌మిళ‌నాడు మూడో స్థానంలో ఉంది. వైర‌స్ బాధితులు పెరుగుతుండ‌డంతో వారికి వైద్యం స్థానికంగానే అందిస్తున్నారు. ఆ విధంగా కన్యాకుమారి జిల్లాలోని ఆచారిపాలెంలో ఒక ప్రైవేట్ స్కూల్ భ‌వ‌నంలో వైద్య చికిత్స ఏర్పాట్లు చేశారు. ఆ భ‌వ‌నంలో సుమారు 150 మంది వైర‌స్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే శుక్రవారం ఓ వైర‌స్‌ బాధితుడికి పరోటా తినాలనిపించింది. దీంతో అనుకున్న‌దే ఆల‌స్యం అతడు వెంట‌నే బ‌య‌ట‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుక‌న్నాడు. వెంట‌నే ఆ భ‌వ‌నం ప్ర‌హ‌రీ గోడ దూకి బయటకు వచ్చాడు. అతడు బయటకు వచ్చే క్రమంలో నాలుగు ఇళ్లను దాటుతూ వచ్చాడు. అక్క‌డ ఉన్న ఓ దుకాణంలో పరోటా కొనుక్కుని తిరిగి ఆ భ‌వ‌నం లోపలకు వెళ్లాడు. ఈ విషయం సీసీ కెమెరాల ద్వారా బయటకు తెలిసింది. దీంతో స్థానికులు భ‌యాందోళన చెందుతున్నారు. త‌మ‌కు వైర‌స్ సోకిందేమోన‌ని దుకాణ‌దారులు.. స్థానికులు ఆందోళ‌న ప‌డుతున్నారు. దీంతో అక్కడ నుంచి కోవిడ్ వార్డ్ ను తరలించాలని స్థానికులు ఆందోళ‌న చేస్తున్నారు.