Begin typing your search above and press return to search.

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా ప్రళయం..

By:  Tupaki Desk   |   18 July 2020 11:18 AM GMT
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా ప్రళయం..
X
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఊహకందని రీతిలో కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటికే రోజుకు 2500 పైగానే కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. ఒక జిల్లాలో ఒక రాష్ట్రంలో నమోదైన కేసులు నమోదుకానుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడా నమోదుకాని విధంగా శనివారం ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 1051 పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. జిల్లా పరిధిలో 1019, జిల్లా ఇతర పరిధిలో 32 కేసులు వచ్చాయని తెలిపారు. ఇక 257మంది హోం క్వారంటైన్ లో ఉండగా.. 185మంది కరోనా నుంచి కోలుకొని తమ తమ ఇళ్లకు చేరకున్నారు.

ఏపీ వ్యాప్తంగా 23872 శాంపిల్స్ ను నిన్న సేకరించారు. 3963మంది మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. మొత్తం మరణాల సంఖ్య 586కు చేరింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 12మంది మరణించారు.

ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో క‌రోనా కేసులు భారీగా నమోదవుతున్న నేప‌థ్యంలో 24 గంట‌ల పాటు జిల్లా వ్యాప్తంగా క‌ర్ఫ్యూ అమ‌లుకు క‌లెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రేపు(ఆదివారం) ఉ.6 గంటల నుండి సోమవారం ఉ.6 గంటల వరకు జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్న‌ట్లు తెలిపారు. అత్య‌వ‌స‌ర వైద్య‌సేవ‌లు, మెడిక‌ల్ షాపుల‌కు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంద‌ని, మిగ‌తా అన్ని సేవ‌లు తాత్కాలికంగా మూసివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో గత రెండురోజుల్లోనే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ధిక్కరించిన వారిపై ఎపిడిమిక్ డిసీజ్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తామ‌ని హెచ్చ‌రిక జారీ చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధి పోలీసు స్టేషన్లలో క‌రోనా కేసులు అధిక‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అక్క‌డ 14 మంది పోలీసు సిబ్బందికి క‌రోనా సోకిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.