Begin typing your search above and press return to search.

ఏపీకి ఊరట: తగ్గుతున్న పాజిటివ్ కేసులు.. తాజాగా ఎన్నంటే?

By:  Tupaki Desk   |   23 Aug 2020 3:54 PM GMT
ఏపీకి ఊరట: తగ్గుతున్న పాజిటివ్ కేసులు.. తాజాగా ఎన్నంటే?
X
ఒక దశలో రోజుకు పది వేల కేసులు పాజిటివ్ గా నమోదైన ఏపీలో పరిస్థితి ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తోంది. ఊహించని రీతిలో భారీగా నమోదవుతున్న కేసులతో ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. రోజువారీగా నమోదయ్యే కేసులు భారీగా పెరిగిపోవటం అందరిని విస్మయానికి గురి చేసింది. పొరుగున ఉన్న తెలంగాణలో మాదిరి ఆచితూచి అన్నట్లు కాకుండా.. విస్తారంగా పరీక్షలు నిర్వహించటం కూడా భారీగా కేసులు నమోదుకు కారణంగా విశ్లేషించటం తెలిసిందే.

గడిచిన నాలుగైదు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. ఈ రోజు విడుదల చేసిన బులిటెన్ ఏపీకి మరింత ఊరటనిచ్చేలా మారింది. గడిచిన ఇరవైనాలుగు గంటల వ్యవధిలో 46,712 మందికి పరీక్షలు జరపగా.. 7,895 మందికి పాజిటివ్ వచ్చినట్లుతేలింది. దీంతో.. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.53 లక్షలకు చేరుకుంది. మరోవైపు కరోనా మరణాలు ఇరవైనాలుగు గంటల వ్యవధిలో 93కు చేరుకున్నాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు 32.38లక్షల మందికి పరీక్షలు జరిపారు. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో కోలుకున్న వారి సంఖ్య మెరుగ్గానే ఉంది. కాకుంటే.. పాజిటివ్ గా తేలిన వారితో పోలిస్తే.. నెగిటివ్ గా వచ్చిన వారి సంఖ్య కాస్త తక్కువగానే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 7,449 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఆ ఒక్క జిల్లాలోనే 24 గంటల వ్యవధిలో 1256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

పాజిటివ్ కేసుల్లో తూర్పుగోదావరి జిల్లా మొదటిస్థానంలో నిలవగా.. తర్వాతి స్థానం నెల్లూరు జిల్లాగా తేలింది. అక్కడ 985 కేసులు నమోదు కాగా.. మూడో స్థానంలో చిత్తూరు జిల్లా నిలిచింది. ఆ ఒక్క జిల్లాలో 934 కేసులు నమోదయ్యాయి. నాలుగో స్థానంలో ప్రకాశం (923) జిల్లా నిలిచింది. అతితక్కువ కేసులు నమోదైన జిల్లాల విషయానికి వస్తే.. క్ఱిష్ణా జిల్లా నిలిచింది. ఆ జిల్లాలో 142 కేసులు మాత్రమే నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో విజయనగరం (200) నిలిచింది.