Begin typing your search above and press return to search.

వెంకన్న సన్నిధిలో కరోనా విశ్వరూపం చూపుతోందే!!

By:  Tupaki Desk   |   13 Sep 2020 2:30 PM GMT
వెంకన్న సన్నిధిలో కరోనా విశ్వరూపం చూపుతోందే!!
X
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దైవ సంబంధిత కార్యకలాపాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇందుకు నిదర్శనమే దేవదేవుడు శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల గిరి ఇప్పుడు కరోనా గుప్పిట చిక్కుకుంది. తిరుమల ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న ఉద్యోగుల్లో 1572 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని తిరుమల వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఏర్పాటైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)నే స్వయంగా వెల్లడించడం విశేషం.

శ్రీవేంకటేశ్వరుడి ఆలయం ఉన్న ఏపీలో కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఏపీలో 5.57 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో టెంపుల్ టౌన్ గా పేరు తెచ్చుకున్న తిరుపతిలో కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. వెంకన్న సన్నిధి తిరుమల ఆలయంలో సైతం కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఒకటి అరా కేసులు నమోదైతేనే గడగడలాడిపోయిన టీటీడీ... ఇప్పుడు వందల కేసులు నమోదవుతున్నా... చూస్తూ ఊరుకోవడం మినహా చేసేదేం లేదన్న రీతిలో వ్యవహరించక తప్పడం లేదు.

కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో యావత్తు దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తిరుమల దర్శనాలు కూడా బంద్ అయ్యాయి. అయితే లాక్ డౌన్ ముగిసిన తరువాత భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు కొండకు అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం టీటీడీలో పనిచేస్తున్న 1572 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఇందులో 1403 మంది కోలుకోగా, 169 మంది చికిత్స పొందుతున్నట్టు టీటీడీ తెలిపింది. కరోనాతో ఐదుగురు ఉద్యోగులు మరణించినట్టు టీటీడీ పేర్కొన్నది.