Begin typing your search above and press return to search.

గంటకు 10 వేల కేసులతో చెలరేగిపోతున్న కరోనా!!

By:  Tupaki Desk   |   19 July 2020 5:30 AM GMT
గంటకు 10 వేల కేసులతో చెలరేగిపోతున్న కరోనా!!
X
బుడిబుడి అడుగులు వేస్తున్నట్లు కనిపించే కరోనా విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. అంతిమంగా దాని తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా చేస్తున్నాయి తాజాగా నమోదవుతున్న గణాంకాలు. మొన్నటివరకు పది వేల కేసులు అంటే.. రోజుల తరబడి సాగేది. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. గంట గడిస్తే చాలు.. వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా సాగుతుందన్న విషయం తాజాగా వెల్లడవుతున్న కేసుల తీవ్రతను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

తాజాగా విడుదలైన గణాంకాల్ని.. వాటిని విశ్లేషించి చూసినప్పుడు గుండెలు అదిరే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. తాజాగా చెలరేగిపోతున్న కరోనా పుణ్యమా అని.. గంటకు పదివేల కేసుల చొప్పున ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్నాయి. అంటే.. లక్ష కేసులు నమోదుకావటానికి కేవలం పది గంటల సమయానికి ఏకంగా లక్ష కేసులు నమోదవుతున్నాయి.

తీవ్రత మరింత అర్థం కావాలంటే.. ఒక సినిమా (రెండున్న గంటల నిడివి) చూసేంతలో ప్రపంచవ్యాప్తంగా పాతిక వేల మంది పాజిటివ్ బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్ తీవ్రత మరింత పెరుగుతోంది. ఒకదశలో యూరప్ ను అట్టుడిగిపోయేలా చేసిన వైరస్ మహమ్మారి ఇప్పుడు అమెరికాతో పాటు.. పలు దేశాల్ని ఉక్కిరిబిక్కిరి పెడుతోంది.

గడిచిన 100 గంటల్లో ఏకంగా 10 లక్షల కేసులు నమోదైన విషయాన్ని లెక్కేశారు. జులై 13 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 1.3 కోట్లుగా ఉన్న సంఖ్య నాలుగు రోజుల వ్యవధిలో ఇది కాస్తా 1.4 కోట్లకు పెరగటం చూస్తే.. వైరస్ మరెంత మహోగ్రరూపం దాలుస్తుందో ఇట్టే అర్థం కాక మానదు. ఎప్పటిలానే ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదవుతున్నాయి. టాప్ త్రీలో మూడో స్థానంలో భారత్ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసులు.. మరణించిన వారిలో సగం ఉభయ అమెరికా ఖండాల్లోనే చోటుచేసుకోవటం గమనార్హం.

అమెరికా తర్వాత కరోనా విలయాన్ని దారుణమైన స్థాయిలో దెబ్బ తిన్న దేశంగా బ్రెజిల్ గా చెప్పాలి. ఇప్పుడా దేశంలో దేశాధ్యక్షుడు బోల్సనోరాతో సహా 20 లక్షలమందికి పైనే పాజిటివ్ రావటం ఒకటైతే.. దీని బారిన పడి ఏకంగా 76 వేల మంది మరణించటం చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి. పాజిటివ్ కేసుల సంఖ్య ఇంత భారీగా నమోదవుతున్నా.. అమెరికన్లు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటం ప్రపంచానికి విస్మయానికి గురి చేస్తోంది.

కట్టడి నిబంధనల్ని పట్టించుకోకపోవటం.. మాస్కుల్ని ధరించే విషయంలోమూఢత్వం.. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్ల మీద తిరుగుతున్న వైనం ఇప్పుడా దేశానికి ఒక పెద్ద గుదిబండలా మారింది. కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో పెరుగుతున్నా.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో మార్కెట్లను ప్రారంభించటమే కాదు.. ఇప్పుడు ఏకంగా స్కూళ్లను తెరిచేందుకు సైతం సిద్ధం కావటంతో రానున్న రోజుల్లోపరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.