Begin typing your search above and press return to search.

చైనాలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

By:  Tupaki Desk   |   14 Jan 2021 12:30 PM GMT
చైనాలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు
X
కరోనా వైరస్ కు పుట్టిల్లయిన చైనాలో మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయా ? అవుననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రాగన్ ఉన్నతాధికారులు. 2019లో డిసెంబర్ లో మొదటిసారిగా చైనాలోని వూహాన్ ప్రావిన్స్ లో కరోనా బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వైరస్ యమా స్పీడుగా ప్రపంచం మొత్తం పాకిపోయింది. చైనా నుండి ప్రపంచానికి ఎంతస్పీడుగా కరోనా వైరస్ పాకిందో అంతే స్పీడుగా చైనాలో మాయమైపోయింది.

వూహాన్ ప్రావిన్స్ లో తప్ప యావత్ చైనాలోని ఇతర ప్రాంతాల్లో వైరస్ ప్రభావం పెద్దగా లేకపోవటంతో యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. తర్వాత్తర్వాత వూహాన్ లో కూడా నూరుశాతం వైరస్ అదుపులోకి వచ్చినట్లు డ్రాగన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే హఠాత్తుగా చైనాలో 115 కేసులు నమోదవ్వటంతో ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. గడచిన ఐదుమాసాలుగా కేసుల సంఖ్య 100కి లోబడే నమోదవుతున్నాయి. అలాంటిది మంగళవారం ఒక్కసారిగా 115 కేసులు రిజిస్టర్ అవ్వటంతో మళ్ళీ టెన్షన్ మొదలైంది.

బీజింగ్ పక్కనే ఉన్న హ్యూబే ప్రావిన్స్ లో 90 కేసులు నమోదైతే మిగిలిన కేసులు హలోంగ్ జియాంగ్ ప్రావిన్స్ నుండి వచ్చిన జనాల ద్వారా సంక్రమించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ముందుజాగ్రత్తగా ఉన్నతాధికారులు చాలా ప్రాంతాల్లో మళ్ళీ లాక్ డౌన్ ప్రకటిస్తున్నారు. దాంతో వైరస్ ప్రభావం ఏ స్ధాయిలో మళ్ళీ విజృంభిస్తోందో మామూలు జనాలకు అర్ధంకావటం లేదు.

ఇదే సమయంలో ఫిబ్రవరిలో జరగబోతున్న చైనా కొత్త సంవత్సర వేడుకులు కూడా అధికారుల్లో టెన్షన్ పెంచేస్తోంది. ఎందుకంటే చైనాలోని జనాలు ఒకచోట నుండి మరోచోటికి ఈ వేడుకల్లో భాగంగా ప్రయాణిస్తుంటారు. కాబట్టి వైరస్ చాలా వేగంగా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని గుర్తించారు. అందుకనే నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు పెట్టే ఆలోచనలో కూడా డ్రాగన్ ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైరస్ కు కేంద్రస్ధానంగా అనుమానిస్తున్న వూహాన్ లో ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్య్లూహెచ్ఓ) బృందం గురువారం నుండి పర్యటించబోతోంది. 14 రోజుల క్వారంటైన్ తర్వాత బృందం తన పరిశోధన మొదలుపెట్టబోతోంది. ఇటువంటి సమయంలో మళ్ళీ వైరస్ విజృంభిస్తుండటం ఆందోళన కలిగించేదే.