Begin typing your search above and press return to search.

కొడుకు కోసం య‌డ్యూర‌ప్ప.. క‌ర్ణాట‌క‌ బీజేపీలో క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   31 Aug 2021 3:35 PM GMT
కొడుకు కోసం య‌డ్యూర‌ప్ప.. క‌ర్ణాట‌క‌ బీజేపీలో క‌ల‌క‌లం
X
సొంత పార్టీ నేత‌ల నుంచి వచ్చిన అసంతృప్తి కార‌ణంగా క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప‌ను త‌ప్పించిన బీజేపీ ఆ స్థానంలో బ‌స‌వ‌రాజు బొమ్మైను గ‌ద్దెక్కించింది. దీంతో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌తాయ‌ని పార్టీ అధిష్ఠానం భావించింది. కానీ మాజీ ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప తీసుకుంటున్న తాజా నిర్ణ‌యాలు రాష్ట్ర బీజేపీ నేత‌ల్లో క‌ల‌కలం సృష్టిస్తున్నాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి మార్పు త‌ర్వాత ప‌రిస్థితులు మ‌రింత జ‌టిలంగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. త‌న‌ను అకార‌ణంగా సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పించార‌ని అధిష్ఠానంపై య‌డ్యూర‌ప్ప కోపంతో ఉండ‌డ‌మే అందుకు కార‌ణం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాష్ట్రంలో ప‌ర్య‌ట‌న చేప‌ట్ట‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.

కొత్త ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజుపై య‌డ్యూర‌ప్ప ఎలాంటి వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌లేదు. కానీ త‌న అనుచ‌రుల‌కు మంత్రివ‌ర్గంలో స‌రైన ప్రాధాన్య‌త ద‌క్క‌లేద‌నే భావ‌న‌లో య‌డ్యూర‌ప్ప ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న వ‌ర్గం నేత‌లు మాత్రం సొంత ప్ర‌భుత్వం మీదే తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ముఖ్య‌మంత్రి పీఠం నుంచి దిగిపోయిన త‌ర్వాత కుటుంబంతో క‌లిసి స‌ర‌దాగా మాల్దీవుల‌కు విహార‌యాత్ర‌కు వెళ్లి వ‌చ్చారు. ఇప్ప‌టివ‌ర‌కూ మౌనంగానే క‌నిపించిన ఆయ‌న‌.. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప‌ర్య‌ట‌న చేప‌ట్టేందుకు నిర్ణ‌యించి పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న కొడుకు విజ‌యేంద్ర కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప కూడా య‌డ్యూర‌ప్ప‌ను క‌ల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

బీజేపీలో ఉంటూనే త‌న బ‌లం నిరూపించుకునేందుకు య‌డ్యూర‌ప్ప వ్యూహాలు ర‌చిస్తున్నార‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. వ‌చ్చే రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల వ‌ర‌కు త‌న కొడుకు విజయేంద్ర‌ను బ‌ల‌మైన నాయ‌కుడిగా తీర్చిదిద్దేందుకు ఆయ‌న ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టిన‌ట్లు య‌డ్యూర‌ప్ప వ‌ర్గం నేత‌లు మాట్లాడుకుంటున్నారు. కాగా ఇప్పుడీ ప‌రిణామాలు రాష్ట్ర బీజేపీలో ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల్లో అధిష్ఠానం జోక్యం చేసుకోవాల‌ని రాష్ట్ర నేత‌లు కోరుతుకున్నారు. య‌డ్యూర‌ప్ప ప‌ర్య‌ట‌న వాయిదా వేయించేలా చూడాల‌ని అంటున్నారు. సీఎంగా బ‌స‌వ‌రాజ్ బాధ్య‌త‌లు తీసుకున్న కొన్ని రోజుల‌కే య‌డ్యూర‌ప్ప ఇలాంటి ప‌ర్య‌ట‌న‌లు చేప‌ట్ట‌డంతో కొత్త స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని రాష్ట్ర బీజేపీ నాయ‌కులు భ‌య‌ప‌డుతున్నారు.

రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో క‌ర్ణాట‌క బీజేపీ ఇంఛార్జ్ అరుణ్ సింగ్ పార్టీలోని ప‌లువురు ముఖ్య నేత‌ల‌తో మాట్లాడి య‌డ్యూర‌ప్ప ప‌ర్య‌ట‌న విర‌మించేలా ఒప్పంచే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉంటాన‌ని చెప్పిన అరుణ్ సింగ్‌.. య‌డ్యూర‌ప్ప చాలా అనుభ‌వం ఉన్న నాయ‌కుడ‌ని ఆయ‌న రాష్ట్రంలో ప‌ర్య‌టించాల‌నుకుంటే అలాగే కొన‌సాగ‌నిద్దామ‌ని అది పార్టీకి ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.