Begin typing your search above and press return to search.

కోళ్ల లలిత కుమారికి కొత్త కష్టం

By:  Tupaki Desk   |   9 Feb 2023 10:52 AM GMT
కోళ్ల లలిత కుమారికి కొత్త కష్టం
X
ఎస్.కోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి రెండు సార్లు గెలిచిన కోళ్ల లలిత కుమారికి కొత్త కష్టమొచ్చింది. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన ఆమె ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తాననే ధీమాలో ఉన్నారు. పార్టీ కూడా నిన్నమొన్నటి వరకు ఆమెకే టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంలో ఉండేది. కానీ.. హఠాత్తుగా ఎన్ఆర్ఐ గొంప కృష్ణ రావడంతో కోళ్ల లలిత కుమారి కష్టాలు మొదలయ్యాయి.

ఇంతవరకు తనకే టికెట్ వస్తుందన్న ఆశతో ఉన్న లలిత కుమారి ఇప్పుడు కంగారు పడుతున్నారట. చంద్రబాబుకు చెప్పి ఎలాగైనా తనకే టికెట్ ఇప్పించాలంటూ పార్టీలో తనకు పరిచయం ఉన్న సీనియర్ నేతలను కలిసి వాపోతున్నారట.

గొంప కృష్ణకు నిజానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. అయితే, ఎన్ఆర్ఐగా ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. తానా కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం పార్టీకి... ఆ పార్టీ యువనేత లోకేశ్‌కు దగ్గరైన ఆయన ఇప్పుడు టికెట్ రేసులో ఉన్నారు. విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన భరత్‌కు కూడా కృష్ణ సన్నిహితులే.

ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా బరిలో దిగాలన్న లక్ష్యంతో ఆయన ఇప్పటికే ఎస్.కోట నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. వేరేగా పార్టీ కార్యాలయం ఏర్పాటుచేసి నియోజకవర్గ నాయకులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో లలిత కుమారి టికెట్ విషయంలో ఆందోళన చెందుతూ అశోక్ గజపతి రాజు, అయ్యన్నపాత్రుడు వంటి సీనియర్ల సహాయంతో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నారు.

అయితే, ఇప్పటికే చంద్రబాబు వద్దకు విషయం వెళ్లినప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో పార్టీ పెద్దల అండదండలతోనే కృష్ణ సొంతంగా కార్యాలయం ఏర్పాటుచేసుకుని నాయకులను తన వైపు తిప్పుకున్నారని లలిత కుమారి లబోదిబోమంటున్నారు.

మరోవైపు నియోజకవర్గంలోని టీడీపీ నేతలకు లలిత కుమారి పట్ల సింపథీ ఉన్నప్పటికీ రానున్న ఎన్నికల్లో డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తే తప్ప గెలవలేరని, లలిత కుమారి డబ్బు బయటకు తీయరని.. అలాంటప్పుడు గొంప కృష్ణకు టికెట్ ఇవ్వడమే కరెక్టని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.