Begin typing your search above and press return to search.

మహా ఎపిసోడ్ లో మధ్యాహ్నం 2.30కే రచ్చ మొదలైంది

By:  Tupaki Desk   |   12 Nov 2019 12:21 PM GMT
మహా ఎపిసోడ్ లో మధ్యాహ్నం 2.30కే రచ్చ మొదలైంది
X
ఏ నిమిషానికి ఏమవుతుందోనన్న ఉత్కంట మహారాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తోంది. చివరకు రాష్ట్రపతి పాలనకు వెళ్లటం మినహా మరో మార్గం లేదన్న విషయంపై రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నా.. అలాంటిదేమీ లేదు.. పలు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మాట శివసేన.. ఎన్సీపీ.. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం రాత్రి 8.30 గంటల లోపు ఎన్సీపీకి మహారాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అవకాశం ఇవ్వటం తెలిసిందే.

అయితే.. ఆ సమయానికి దాదాపు ఆరు గంటల ముందే.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. టీవీ ఛానల్స్ లో.. వాట్సాప్ మెసేజ్ లలో రాష్ట్రపతి పాలనకు మహా గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ స్వయంగా రంగంలోకి దిగింది.

తాము రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్ని రాజ్ భవన్ కొట్టిపారేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సచిన్ కల్బగ్ వెల్లడించారు. ఇప్పటికింకా మధ్యాహ్నం 2.30 గంటలు మాత్రమే అయ్యింది. అప్పుడే రాష్ట్రపతి పాలనకు ఎలా సిఫార్సు చేస్తారంటూ ఆయన ట్వీట్ చేశారు.

నిప్పు లేనిదే పొగ రాదు కదా? మరీ.. ప్రచారం ఎందుకు షురూ అయ్యిందంటే.. దానికి కారణం లేకపోలేదు. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు (బ్రిక్స్ సమావేశంలో పాల్గొనటానికి బ్రెజిల్) వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అత్యవసర కేబినెట్ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ లో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్సీపీ విఫలమైతే రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో.. గవర్నరే సిఫార్సు చేసినట్లుగా మసాలాను దట్టించటంతో కొత్త గందరగోళానికి తెర లేచిందని చెప్పాలి.