Begin typing your search above and press return to search.

నాడు విజ‌య‌శాంతి... నేడు ఈట‌ల రాజేంద‌ర్‌

By:  Tupaki Desk   |   2 Jun 2021 3:30 AM GMT
నాడు విజ‌య‌శాంతి... నేడు ఈట‌ల రాజేంద‌ర్‌
X
అనూహ్య రీతిలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీర్ ఆగ్ర‌హానికి గురై, అనంత‌రం అంతే షాకింగ్ గా మంత్రి ప‌ద‌విని కోల్పోయిన టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత ఈట‌ల రాజేంద‌ర్ పొలిటిక‌ల్ జ‌ర్నీ బీజేపీ వైపు సాగుతుంద‌నే స్ప‌ష్ట‌త దాదాపుగా వ‌చ్చేసిన‌ట్లే. ఈట‌ల ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్ద‌ల‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం , ఈ మేర‌కు త్వ‌ర‌లోనే కండువా క‌ప్పుకోనున్నార‌నే టాక్ ఓ వైపు వినిపిస్తుండ‌గా మ‌రోవైపు...మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను చేర్చుకోవాలన్న ప్రతిపాదనలపై పార్టీ నాయకుల్లో విభేదాలు బయటపడుతున్నాయంటున్నారు. రెండు ప్ర‌ధాన కార‌ణాల‌తో ఈట‌ల చేరిక‌పై గ్రూపు రాజ‌కీయాల టాక్ తెర‌మీద‌కు వ‌స్తోంది.

ఈటల వామ‌ప‌క్ష భావ‌జాలం గ‌ల వ్య‌క్తి అనేది అందరికీ తెలిసిన విషయమేనని, అలాంటి వ్యక్తికి పార్టీలోకి రైట్‌ చెప్పడం ఎంతవరకు సమంజసమనే చర్చ పార్టీలో జరుగుతున్నదని బీజేపీ నేతలే అంటున్నారు. మ‌రోవైపు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న సీనియర్లకు చెప్పకుండా.. స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒక నేతను పార్టీలోకి ఆహ్వానించడంపై బీజేపీలో అసంతృప్తి వెల్లడయింది. ఇప్పటికే ఈటల చేరిక వ్యవహారానికి సంబంధించి హుజూరాబాద్‌లో సీనియర్‌ నాయకుడు పెద్దిరెడ్డి ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. సీనియర్లకు సమాచారం ఇవ్వకుండా.. ఎవరి ఇంట్లోనో, ఫాంహౌజ్‌లోనో నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో పార్టీకి నష్టం కలుగుతుందనే అంశాన్ని బహిరంగంగానే వినిపించారు.

మ‌రోవైపు నిజానికి ఈటలను బీజేపీలోకి తీసుకురావడం వెనుక కేంద్ర స‌హాయ మంత్రి కిషన్‌రెడ్డిదే ప్రధానపాత్రగా చెప్పుకొంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు పగ్గాలు వేయాలనే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఇదంతా అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. గతంలో బీజేపీ మహిళానేత డీకే అరుణ ప్రభావాన్ని తగ్గించేందుకే సినీనటి విజయశాంతిని కిషన్‌రెడ్డి తీసుకొచ్చినట్టు పార్టీలోనే చెప్పుకొన్నారు. మొత్తంగా నాటు విజ‌య‌శాంతి, నేడు ఈట‌ల రాజేంద‌ర్ వ‌ర్గ రాజ‌కీయాల్లో తెర‌మీద‌కు వ‌చ్చిన పేర్లు అని టాక్‌.