Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాల సిత్రం.. మహాలక్ష్మిదేవి పేట ఒకే వీధి రెండు జిల్లాల్లో!

By:  Tupaki Desk   |   5 April 2022 8:30 AM GMT
కొత్త జిల్లాల సిత్రం.. మహాలక్ష్మిదేవి పేట ఒకే వీధి రెండు జిల్లాల్లో!
X
అవును.. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అనేక సిత్ర విచిత్రాలకు తావిచ్చింది. అయితే.. అవన్నీ ఒక ఎత్తు.. ఇప్పుడు చెప్పే ఉదంతం మరో ఎత్తు. కొత్త జిల్లాల ఏర్పాటు వేళ.. రెవెన్యూ అధికారులు సరైన మదింపు చేయకపోవటంతో ఇలాంటి సమస్య వచ్చిందంటున్నారు.

కనీస జాగ్రత్తలు పాటించి ఉంటే.. ఈ చిన్న ఊరి వారికి వచ్చి పడిన కష్టం ఉండేది కాదంటున్నారు. ఒక గ్రామంలో ఒకే వీధిలో కుడివైపు ఒక జిల్లా.. ఎడమ వైపు మరో జిల్లాలో ఉండటం దేనికి నిదర్శనం?

అంతేనా? ఈ గ్రామంలోని ఒకే వీధిలో రెండు దిక్కులు రెండు మండలాలుగా.. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలుగా.. రెండు వేర్వేరు జిల్లాల సరిహద్దుగా మారింది. దీన్ని ఆ గ్రామస్తులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇంతకీ ఇంతటి వెరైటీ ఊరు ఎక్కడుంది? ఆ ఊరి పేరు ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. 'మహలక్ష్మిదేవి పేట' అనే ఊరి పేరు ఎప్పుడైనా విన్నారా? నూటికి 99.9 శాతం మంది కచ్ఛితంగా విని ఉండరు. ఈ గ్రామం ఇప్పటివరకు కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేది.

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అధికారులు పుణ్యమా అని.. ఈ ఊరు కొత్త జిల్లాల ప్రక్రియకు బలైంది. ఎందుకంటే.. మహలక్ష్మిదేవి పేటలోని గ్రామంలోని ఒక వీధిలోని కుడి ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుగా మారితే.. ఏడమ వైపు ప్రాంతం ఏలూరు జిల్లా సరిహద్దుగా మారింది.

అంటే ఒకే వీధిలోని రెండు వైపుల వారు.. వేర్వేరు జిల్లాలు కావటంతో పాటు.. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకవైపు.. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం మరో వైపు మారింది. ఒకే వీధిలో ఉండే ఎదురెదురు ఇళ్లు.. వేర్వేరు జిల్లాల్లో ఉండటం ఆ గ్రామస్తుల కొత్త చిక్కు వచ్చే పడేలా చేస్తుందని చెప్పక తప్పదు.