Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త జిల్లాల సందడి.. ఒకట్రెండు రోజుల్లో అధికార ప్రకటన

By:  Tupaki Desk   |   25 Jan 2022 4:34 AM GMT
ఏపీలో కొత్త జిల్లాల సందడి.. ఒకట్రెండు రోజుల్లో అధికార ప్రకటన
X
తాము అధికారంలోకి వస్తే.. ప్రతి పార్లమెంటు స్థానాన్ని జిల్లాగా మారుస్తామంటూ వైసీపీ అధినేత.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలోనే ప్రకటించటం తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఈ అంశంపై జగన్ సర్కారు పని చేయటం.. ప్రాధమికంగా కొంత కసరత్తు జరగటం తెలిసిందే.

ప్రస్తుతం ఏపీలో ఉన్న 13 జిల్లాలకు బదులుగా 26 జిల్లాలు చేయాలన్న యోచనలో జగన్ సర్కారు ఉంది. వాస్తవానికి ప్రతి లోక్ సభ స్థానాన్ని ఒక జిల్లాగా మార్చటం లెక్కగా అయితే.. 26 జిల్లాలు కాకూడదు. కానీ.. అరకు లోక్ సభ స్థానాన్ని రెండు జిల్లాలుగా చేయాలని నిర్ణయించటం తెలిసిందే.

ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో ప్రతి పార్లమెంటుస్థానాన్ని జిల్లాగా చేయటం వల్ల.. ఇప్పుడున్న జిల్లాల స్వరూపం మారటమే కాదు.. ఒక జిల్లాలో కొంతభాగం మరో జిల్లాలో మరికొంత భాగం కలిసి పోవాల్సి ఉంటుంది. అంటే.. ఒక నగరం లేదంటే పట్టణం.. కొంతభాగంగా ఇప్పుడున్న జిల్లాలో.. మరికొంత భాగం మరో జిల్లాలో పరిధిలోకి వెళ్లనుంది.

ఈ అంశం కొన్ని భావోద్వేగ అంశాలతో ముడి పడి ఉందని.. జిల్లాల ప్రకటన తర్వాత అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందంటున్నారు.

వాస్తవానికి కొత్త జిల్లాల నిర్ణయాన్ని గతంలోనే అధికారికంగా ప్రకటించాలని భావించినా.. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవటంతో ఆగినట్లు చెబుతున్నారు. ఎందుకంటే..జనాభా లెక్కల సేకరణ పూర్తి అయ్యే వరకు జిల్లాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన ఉంది.

ఈ కారణంగానే జనాభా లెక్కల సేకరణ పూర్తి అయ్యే వరకు కొత్త జిల్లాల ప్రకటన ఉండదని చెబుతారు. వాస్తవానికి 2021 మే నాటికి జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. కాకుంటే.. కొవిడ్ కారణంగా ఆ ప్రక్రియ ఆలస్యమవుతోంది.

తాజాగా మాత్రం కొత్త జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయాలని ఏపీ సర్కారు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఒకట్రెండు రోజుల్లోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కాని నేపథ్యంలో.. నోటిఫికేషన్ విడుదల సాధ్యమా? అన్నది ప్రశ్నగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.