Begin typing your search above and press return to search.

టెన్ష‌న్ లో జ‌గ‌న్..కొత్త జిల్లాలపై కోర్టు ఏమంటుందో ?

By:  Tupaki Desk   |   14 March 2022 3:55 AM GMT
టెన్ష‌న్ లో జ‌గ‌న్..కొత్త జిల్లాలపై కోర్టు ఏమంటుందో ?
X
ఇవాళ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కొన్నిఅభ్యంత‌రాలు వ‌స్తున్న నేప‌థ్యంలో హైకోర్టులో సంబంధించి పిటిష‌న్ విచార‌ణ‌కు రానుంది.దీనిపై ఉన్న‌త న్యాయ స్థానం ఏం చెప్ప‌బోతోంది అన్న‌దే ఇప్పుడొక అత్యావ‌శ్య‌క ప‌రిణామం.ఎందుకంటే ఆర్టిక‌ల్ 371డి ప్ర‌కారం కొత్త జిల్లాల ఏర్పాటు అన్న‌ది చెల్ల‌ద‌ని ఇప్ప‌టికే పిటిష‌న‌ర్లు కోర్టుకు విన్న‌విస్తూ, ఇదే స‌మ‌యంలో కొన్నిఅభ్యంత‌రాలు కూడా చెప్పారు. ఇప్ప‌టికే జ‌న‌వ‌రి 25న ఇచ్చిన నోటిఫికేష‌న్ ను నిలుపుద‌ల చేయాల‌ని కూడా కోరుతున్నారు పిటిషిన‌ర్లు.

దీంతో ఈ విష‌య‌మై ఏం చెప్పాలో ఏ విధంగా కోర్టును ఒప్పించి నెగ్గుకు రావాలో అన్న సందిగ్ధ‌త ఒక‌టి వెన్నాడుతోంది ప్ర‌భుత్వ వ‌ర్గాల‌ను. ఇప్ప‌టికే 3 రాజ‌ధానుల విష‌య‌మై ఏమీ మాట్లాడ‌లేక పోతోంది. అస‌లు ఆ ప్ర‌తిపాద‌న ఎందుకు తెర‌పైకి తెచ్చారు అన్న వాద‌న‌తో ఏకీభావం తెల‌ప‌లేక అటు అమ‌రావ‌తి భూములను తాక‌ట్టు పెట్టి అప్పులు తీసుకురాలేక అందుకు కోర్టు ఇస్తున్న ఆంక్ష‌లు అధిగ‌మించ‌లేక జ‌గ‌న్ స‌ర్కారు ఇప్ప‌టికే ఎన్నో అవ‌స్థ‌లు పడుతోంది అన్న‌ది సుస్ప‌ష్టం. ఇప్పుడు వ‌చ్చిన కొత్త త‌ల‌నొప్పిని క్లియ‌ర్ చేయ‌డం అంత సులువు కాదు.

వాస్త‌వానికి జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముందుగా జోన్ల ఏర్పాటుకు సంబంధించి ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఎటువంటి స్ప‌ష్ట‌తా లేదు. జోన్ల‌ను కొత్త‌గా ఏర్పాటు చేసి తెలంగాణ మాదిరిగానే ఆంధ్రాలోనూ వివిధ శాఖ‌ల్లో నెల‌కొన్న ఖాళీలు చూపాల్సి ఉంటుంది.ఈ ప్ర‌క్రియ కూడా అంత సులువేం కాదు. తెలంగాణలో కేసీఆర్ ఈ ప్ర‌క్రియ‌ను స‌జావుగా పూర్తి చేశార‌ని కొంద‌రు భావించినప్ప‌టికీ అది కూడా అంతా అనుకున్న రీతిలోనో లేదా అధికార‌పార్టీ టీఆర్ఎస్ చెబుతున్న విధంగానో సాగ‌లేదు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఈ జ‌గ‌డంలోనే ప‌డ‌నున్నారు.

అశాస్త్రీయ విధానంలో జిల్లాల విభ‌జ‌న మ‌రియు ఏర్పాటు ఉంద‌ని ఇప్ప‌టికే కేంద్రం మొత్తుకుంటోంది.క‌నుక కొత్త జిల్లాల ఏర్పాటు అన్న‌ది రాష్ట్ర ప్ర‌భుత్వంకు మున్ముందు స‌వాళ్ల‌నే మోసుకురానుంది. వీటిని అధిగ‌మించడం అనుకున్నంత సులువు కాదు. అందుకే కొత్త జిల్లాల ఏర్పాటు అనే తేనెతుట్ట‌ను చంద్ర‌బాబు ఆ రోజు క‌ద‌ప‌లేద‌ని, సంబంధిత ప్ర‌క్రియ‌ను వాయిదా వేసి తెలివిగానే త‌ప్పుకున్నార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.ఇదే విష‌య‌మై జ‌గ‌న్ మాత్రం కాస్త దూకుడుగానే వెళ్తున్నార‌ని కోర్టు చెప్పే అభ్యంత‌రాల‌ను క్లియ‌ర్ చేస్తే మాత్రం ఉగాది నాటికి అనుకున్న విధంగా జిల్లాల ఏర్పాటు అన్న‌ది సుగ‌మం కావొచ్చ‌ని లేదంటే తాత్సారం తప్ప‌దని యంత్రాంగం సైతం అంటోంది.