Begin typing your search above and press return to search.

జగన్ ఉగాది ఆశలు ?

By:  Tupaki Desk   |   26 Jan 2022 12:30 PM GMT
జగన్ ఉగాది ఆశలు ?
X
తెలుగు వారికి అచ్చ తెలుగు పండుగ ఉగాది. ఆ పండుగతో తెలుగు వారి కొత్త సంవత్సరాది మొదలవుతుంది. అంటే తెలుగు ప్రజలు తమ జాతకాలు చూసుకుంటూ ఏడాది అంతా మంచి జరగాలని తొలి అడుగు వేసే పండుగ అది. అలాంటి ముఖ్యమైన ఉగాది రోజుని జగన్ ఎపుడూ మంచి కార్యక్రామానికి వేదికగా చేయాలనుకుంటున్నారు. కానీ వీలుపడడంలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ 2020 ఉగాదికి ముప్పయి లక్షల ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయాలనుకున్నారు. కానీ ఆ సమయానికి కరోనా వచ్చి ఉగాది సంబరాలను ఏమీ కాకుండా చేసింది.

ఇక 2021 ఉగాదికి వచ్చేసరికి మూడు రాజధానులను ముందుకు తెచ్చి విశాఖ నుంచి పాలన సాగించాలని చూశారు. అయితే దాని మీద కోర్టు కేసులు, అమరావతి ఉద్యమాలు ఇతర కారణాలతో జగన్ కి ఆ ఉగాది కూడా కలసి రాకుండా పోయింది. దాంతో ఆయనతో పాటు వైసీపీ నేతలు అంతా ఉసూరుమన్నారు.

ఇపుడు ముచ్చటగా మూడవ ఉగాది వేళ మరో బృహత్తర కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు. ఈసారి ఉగాది నుంచి ఏపీలో పదమూడు జిల్లాలను కాస్తా 26 జిల్లాలుగా మార్చి సరికొత్త పాలనను మొదలెట్టాలని చూస్తున్నారు. అయితే ఉగాది అంటే ఇప్పటికి గట్టిగా రెండు నెలలు లేదు.

అయితే కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యంతరాలకు, సలహాలు సూచనల స్వీకరణకు నెల రోజులు గడువు పెట్టారు. ఫిబ్రవరి 26 తరువాత అలా వచ్చిన అభ్యంతరాలను సూచనలు పరిశీలించి ఒక కొలిక్కి తీసుకువస్తారు. అన్నీ అనుకున్నట్లుగా సాగితే జగన్ కోరుకున్న ఉగాది వస్తుంది.

అయితే ఇక్కడే మరిన్ని సందేహాలు వస్తున్నాయి. కేంద్ర సెన్సస్ డైరెక్టర్ కొత్తగా జిల్లాలను, గ్రామాలను, ప్రాంతాలను విభజించవద్దు అంటూ నిషేధిత ఉత్తర్వులు చాలా కాలం క్రితమే జారీ చేశారు. నిజానికి 2020 నుంచి కొత్త జనాభా లెక్కలు చేపట్టాలి. కరోనా వల్ల అది ఎప్పటికపుడు ఆలస్యం అవుతోంది. దాని వల్ల కొత్త జిల్లాలకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. ఇపుడు దాన్ని పక్కన పెట్టి మరీ వైసీపీ సర్కార్ కొత్త జిల్లాలను ప్రకటించింది. మరి దీని మీద అధ్యయ‌నం వరకూ ఓకే కానీ ఏకంగా కొత్త జిల్లాలను అఫీషియల్ గా ప్రకటించడం అయితే కుదురుతుందా అన్నదే అతి పెద్ద డౌట్.

అసలే ఉగాది యాంటీ సెంటిమెంట్ ఒకటి వైసీపీని పట్టి పీడిస్తోంది. అయితే ఈ మధ్యనే విజయసాయిరెడ్డి సహా కీలక నేతలు ఢిల్లీ వెళ్ళినపుడు ఇదే విషయాన్ని అక్కడ కేంద్ర పెద్దలతో కదిపి ఉంటారని, ఆ తరువాతనే ఈ ప్రక్రియ ఊపందుకుందంటే జరిగి తీరుతుందని నమ్మకం ఉండబట్టేనని అంటున్నారు. చూడాలి మరి ఏ ఆటంకాలు లేకుండా జరిగితే మాత్రం జగన్ కి అసలైన ఉగాది ఈ ఏడాదే అవుతుంది అనడంలో సందేహం లేదు.