Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాల లెక్క ఫైనల్ అయ్యిందోచ్

By:  Tupaki Desk   |   5 Aug 2016 5:11 AM GMT
కొత్త జిల్లాల లెక్క ఫైనల్ అయ్యిందోచ్
X
ఎన్నో అంచనాలు.. మరెన్నో వాదనలు. ఇన్నింటి మధ్య తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చాలానే వార్తలు బయటకు వచ్చాయి. దసరా సందర్భంగా తెలంగాణలో కొత్త జిల్లాల్ని షురూ చేయాలని తెలంగాణ అధికారపక్షం పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. దీనికి తగ్గట్లే రెండు నెలల క్రితం భారీ కసరత్తు జరగటంతో పాటు.. యుద్ధ ప్రాతిపదికన పలు కార్యక్రమాలు నిర్వహించారు. షెడ్యూల్ లో భాగంగా జులైలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చాలానే కార్యక్రమాలు జరగాల్సి ఉన్నా.. అనుకోని విధంగా ఎదురైన కారణాలతో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలు ఏమీ జరగలేదు.

ఈ కారణంగా కొత్త జిల్లాల ఏర్పాటు ఆలస్యం కాకూడదని.. వాయిదా పడకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాలకు సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారని.. కొత్త జిల్లాలకు సంబంధించిన కీలక నోటిఫికేషన్ వచ్చే వారంలో విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతున్నారు. నోటిఫికేషన్ ముసాయిదాను అధికారులు సిద్ధం చేశారని.. దానిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టి ఓకే అంటే చాలు.. ప్రకటన విడుదల అవుతుందని చెబుతున్నారు. ఈ ముసాయిదా తర్వాత 30 రోజుల వ్యవధిలో ప్రభుత్వం దృష్టికి వచ్చే అభ్యంతరాలపై ప్రభుత్వం దృష్టి సారించి.. వాటిని పరిష్కరించిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి కానుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కొత్త జిల్లాలకు సంబంధించి ఆ మధ్యన ఫైనల్ ఫిగర్ అనుకున్న 14 జిల్లాలు కాకుండా 13 జిల్లాలకే పరిమితం కానున్నట్లుగా చెబుతున్నారు. చివర్లో చేరిన సిరిసిల్లా జిల్లాను తాజా జాబితాను తొలగించినట్లుగా సమాచారం. గతంలో అనుకున్న సిరిసిల్లా జిల్లాను పక్కన పెట్టటమేకాదు.. కొత్తగా తెరపైకి వచ్చిన నిర్మల్ జిల్లా ఏర్పాటు విషయాన్ని కూడా పక్కన పెట్టేయటం గమనార్హం.

ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాల్ని మాత్రమే ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. 13 కొత్తజిల్లాలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. 74 మండలాల్ని కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. తాజాగా ఫైనల్ చేసినట్లుగా చెబుతున్న 13 జిల్లాల్ని చూస్తే..

1. మంచిర్యాల (కొమురంభీం)

2. జగిత్యాల

3. భూపాలపల్లి (అచార్య జయశంకర్)

4. మహబూబాబాద్

5. కామారెడ్డి

6. సంగారెడ్డి

7. సిద్ధిపేట

8. వనపర్తి

9. నాగర్ కర్నూల్

10. సూర్యాపేట

11. యాదాద్రి (భువనగిరి)

12. కొత్తగూడెం

13. సికింద్రాబాద్