Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాలు : ఉత్త‌రాంధ్ర అభ్యంత‌రాలివే ..!

By:  Tupaki Desk   |   1 March 2022 1:30 PM GMT
కొత్త జిల్లాలు : ఉత్త‌రాంధ్ర అభ్యంత‌రాలివే ..!
X
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మ‌రో నెల రోజులు మాత్రమే వ్య‌వ‌ధి ఉండ‌డంతో అధికారులు సంబంధిత అభ్యంత‌రాలు స్వీక‌రించే ప‌నిలో ప‌డ్డారు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర అభ్యంత‌రాలు తెలుసుకునేందుకు ప్రాధాన్య‌మిస్తూ నిన్న‌టి వేళ విశాఖ క‌లెక్ట‌రేట్ లో జిల్లాల పున‌ర్విభ‌జ‌న క‌మిటీ చైర్మ‌న్ విజ‌య కుమార్ ప్ర‌జాభిప్రాయం విన్నారు.

త్వ‌ర‌లోనే జిల్లాల ఏర్పాటుకు స‌న్నాహాలు మొద‌లు కానున్నందున ఉత్త‌రాంధ్ర నుంచి అదేవిధంగా తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి వ‌చ్చిన విన్న‌పాల‌ను న‌మోదు చేసుకున్నారు.వాటి ప్ర‌కారం శ్రీ‌కాకుళం నుంచి పెద్ద‌గా అభ్యంత‌రాలేవీ లేవు.

పాల‌కొండ ను జిల్లాగాప్ర‌క‌టించాల‌ని తొలుత డిమాండ్ ఉన్నా ఎందుక‌నో అది పూర్తి స్థాయిలో కార్య‌రూపం దాల్చ‌లేదు.దీంతో ఈ ప్రాంతం పార్వ‌తీపురం కేంద్రంగా ఉండే మ‌న్యం జిల్లాలోనే ఉండ‌నుంది.అదేవిధంగా శ్రీ‌కాకుళం జిల్లాకు గౌతు ల‌చ్చ‌న్న పేరు ఉంచాల‌ని చాలా మంది అడిగారు కానీ అది కూడా కార్య‌రూపం దాల్చ‌లేదు. స్వాతంత్ర్య స‌మ‌రయోధులు అయిన గౌతు ల‌చ్చ‌న్న పేరుకు సంబంధించి ఆయ‌న‌కు చెందిన శ్రీ శ‌య‌న సామాజిక‌వ‌ర్గం ప‌ట్టుబట్టింది. స్పీక‌ర్ తో స‌హా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను క‌లిసి త‌మ విన్న‌పాలు అందించింది.ఈ డిమాండ్ పెద్ద‌గా నిల‌బ‌డ‌లేదు.

ఇక పార్వ‌తీపురం కేంద్రంగా ఏర్పాట‌య్యే జిల్లాకు మ‌న్యం జిల్లా అని కాకుండా పార్వ‌తీపురం అనే ఉంచాల‌న్న డిమాండ్ ఉంది. ఇదే స‌మ‌యంలో భార‌త రాష్ట్ర‌ప‌తిగా ప‌నిచేసిన వీవీ గిరి పేరును కానీ నాగావ‌ళి న‌ది పేరును కానీ ఉంచాల‌న్న డిమాండ్ కూడా ఉంది.ఇవేవీ కూడా నిన్న‌టి వేళ వినిపించిన దాఖ‌లాలు లేవు.

శ్రీ‌కాకుళం జిల్లా, పాత‌పట్నం కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజ‌న్ ఏర్పాటు చేయాల‌ని అడుగుతున్నారు.దీనిపై కూడా పెద్ద‌గా ఉద్య‌మాలు అయితే లేవు.విశాఖ జిల్లా పెందుర్తిని ఆ జిల్లాలో క‌ల‌పాల‌ని,అన‌కాప‌ల్లిలో చేర్చ‌డం భావ్యం కాద‌ని టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ బండారు స‌త్య‌నారాయ‌ణ ప‌ట్టుబ‌డుతున్నారు. ఇప్ప‌టికే పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధి,

జీవీఎంసీ ప‌రిధి అన్నీంటిలోనూ పెందుర్తి నియోజ‌క‌వర్గం ఉంద‌ని, దీనిని తీసుకుని వెళ్లి అన‌కాప‌ల్లి జిల్లాలో క‌లిపే క‌న్నా విశాఖ‌లోనే ఉంచాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో అన‌కాప‌ల్లి కేంద్రంగా ఏర్పాట‌య్యే ప్ర‌తిపాదిత జిల్లాకు సంబంధించి ఓ డిమాండ్ వ‌చ్చింది.ఈ జిల్లాకు న‌ర్సీప‌ట్నంను జిల్లా కేంద్రంగా ఉంచాల‌ని కోరుతున్నారు.