Begin typing your search above and press return to search.

మోడీ కాన్వాయ్ నిలిచిన ఎపిసోడ్ పై కొత్త సందేహాలు

By:  Tupaki Desk   |   6 Jan 2022 8:30 AM GMT
మోడీ కాన్వాయ్ నిలిచిన ఎపిసోడ్ పై కొత్త సందేహాలు
X
పంజాబ్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ప్రధాని మోడీ కాన్వాయ్ ను అక్కడి రైతులు అడ్డుకోవటం.. ఫైఓవర్ మీద 20 నిమిషాలు ఆగిపోవటం.. విధి లేని పరిస్థితుల్లో వెనక్కి వచ్చేయటం.. ప్రాణాలతో తిరిగి రాగలిగాను.. ధన్యవాదాలు అంటూ ప్రధాని పేర్కొనటం లాంటివన్నీ తెలిసిందే. ఈ విషయంలోకి.. ఇప్పుడు మీరు చూసిన వైరల్ వీడియోలోని విషయాల గురించి మాట్లాడటానికి ముందు.. మనం రెగ్యులర్ గా చూసే ఒక అంశాన్ని చెప్పుకుందాం.

మీ ఊళ్లోకు ఎప్పుడైనా రాష్ట్ర హోం మంత్రి వస్తున్నా? లేదంటే మంత్రి వస్తుంటే.. ఎలాంటి పరిస్థితులు ఉంటాయో గుర్తు చేసుకోండి. ఇక.. ముఖ్యమంత్రి వస్తుంటే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటిది.. దేశ ప్రధానమంత్రి వస్తున్నారంటే.. భద్రత ఏ స్థాయిలో ఉంటుందో? ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతదాకా ఎందుకు? మొన్నటికి మొన్న.. అనుమతి లేకుండా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తమ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేస్తుంటే..పోలీసులు తలుపులు బద్ధలు కొట్టుకొని మరీ లోపలకు వెళ్లటమే కాదు.. వాటర్ క్యాన్ చేసి.. అక్కడ ప్రతిఘటించిన వారిని అదుపులోకి తీసుకొని మరీ బండిని అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లటం ద్వారా పోలీసులు తాము చేయాల్సిన పనిని విజయవంతంగా పూర్తి చేశారు.

ఇప్పుడు విషయంలోకి వద్దాం. ఒక హోం మంత్రి వస్తేనే.. భద్రతా బలగాలు ఏ రీతిలో అలెర్టుగా ఉంటాయో తెలిసినప్పుడు.. దేశ ప్రధాని.. అందునా నరేంద్ర మోడీ లాంటి పవర్ ఫుల్ పీఎం వస్తుంటే.. భద్రతా పరమైన చర్యలు మరెంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది.. నడిరోడ్డు మీద.. అందునా ఫ్లైఓవర్ మీదన 20 నిమిషాల పాటు ఆగిపోయే పరిస్థితి అంటే.. నిఘా వర్గాల లోపంతో పాటు.. భద్రతా పరమైన లోపాలు పెద్ద ఎత్తున ఉన్నాయన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

అన్నింటికి మించి స్థానిక పోలీసుల సహాయ నిరాకరణ కూడా జరిగి ఉంటుందన్నఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వాదనకు బలం చేకూరేలా ఒక వీడియోవైరల్ అవుతోంది. ప్రధాని కార్వాయ్ ఏ ఫ్లైఓవర్ మీద 20నిమిషాల పాటు నిలిచిపోయిందో.. అదే ఫ్లైఓవర్ కు కాస్త దూరంలో ఆందోళన కారులు (రైతులు అని చెబుతున్నారు) పెద్ద ఎత్తున ఉండటం తెలిసిందే. ఈ వీడియోను జాగ్రత్తగా చూస్తే.. ప్రధాని కాన్వాయ్ ఆగటానికి కాస్త ముందుగా తీసినట్లు కనిపిస్తోంది. ఇందులో అటు ఆందోళనకారులు.. ఇటు పోలీసులు ఎంచక్కా టీలు తాగటం కనిపిస్తుంది.

ఇదంతా చూసినప్పుడు.. ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ ను నిలిపేసే విషయంలో ఒకలాంటి క్లారిటీ ఉందన్న భావన కలగటం ఖాయం. మరి.. ప్రధాని భద్రతా వ్యవహరాల్నిచూసే వర్గాలతో పాటు.. నిఘా సంస్థలు నిద్ర పోతున్నాయా? ఇలాంటి తీరును ముందుగా హెచ్చరించాల్సి ఉంటుంది కదా? మరేం జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. ప్రధాని మోడీ కాన్వాయ్ ను ఆపేసిన ఎపిసోడ్ కు సంబంధించి.. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ వైరల్ వీడియో చూశాక.. సమ్ థింగ్.. సమ్ థింగ్ తేడా అన్న భావన కలుగక మానదు.