Begin typing your search above and press return to search.

ఓసీ పోలరైజేషన్ : కొత్త సమీకరణలతో భారీ షాక్..?

By:  Tupaki Desk   |   26 May 2022 5:30 PM GMT
ఓసీ పోలరైజేషన్ : కొత్త సమీకరణలతో భారీ షాక్..?
X
ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలు వెలుగు చూస్తాయా అంటే జవాబు అవును అనే వస్తోంది. సామాజికవర్గ పోరు ఏపీలో ఎపుడూ ఉంది. ఇది స్వాతంత్రం ముందు తరువాత కూడా కొనసాగుతూ వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా కులాల కుంపట్లు రాజుకుంటున్నాయి. దీని ఫలితాలు పర్యవశానాలు ఎలా ఉండబోతాయి అన్నదే రాబోయే రోజులలో చూడాలి అన్నది విశ్లేషణగా ఉంది.

ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, బడుగులకు మైనారిటీలకు విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చామని వైసీపీ సర్కార్ చెప్పుకుంటోంది. ఆ పార్టీ అధికారంలోకి రావడంతోనే సోషల్ ఇంజనీరింగ్ కి తెర తీసింది. అయితే ఇది ఎలా ఉంది అంటే ఉన్నది కాస్తా అతిగా మారి అసలుకే ఎసరు పెట్టేలా అని సొంత పార్టీలోనే కామెంట్స్ వచ్చి పడుతున్నాయి.

నిజంగా సామాజిక న్యాయం చేస్తున్నామని వైసీపీ పెద్దలు చెప్పుకుంటున్నా డొల్లతనం మరో వైపు కనిపిస్తోంది. అదెలా అంటే అసలైన అధికారాలు అన్నీ కూడా పార్టీ ముఖ్యులు వద్దనే ఉంటున్నాయని విమర్శలు ఉన్నాయి. ఇక బీసీల కోసం కార్పోరేషన్లు ఏర్పాటు చేసినా నిధులు విధులు లేవని వారే ఉస్సురంటున్నారు. ఇంకో వైపు మంత్రులకు కీలకమైన శాఖలు ఇచ్చినా వారు స్వేచ్చగా పనిచేసుకునేందుకు ఎంతవరకూ అవకాశం ఉందని టీడీపీ వంటి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

ఇక ఏపీ మంత్రివర్గంలో పాతిక మంది దాకా ఉంటే అందులో 17 మందికి అవకాశాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. సామాజిక న్యాయ భేరీ పేరిట బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే రాజకీయంగా కీలకమైన కులాలను తమ వైపునకు తిప్పుకోవడానికే ఇలాంటి ప్రయోగాలను వైసీపీ చేస్తుంది అన్న మాట ఉంది.

దానికి తగినట్లుగా సొంత పార్టీలోని మిగిలిన వర్గాల నుంచి అసంతృప్తి కూడా వ్యక్తం అవుతోంది. ప్రధానంగా జగన్ రెండవసారి మంత్రివర్గాన్ని విస్తరించిన మీదట పెద్ద ఎత్తున అసంతృప్తి మిగిలిన అగ్ర కులాలలో కలిగింది అంటున్నారు. సామాజిక అసమానతలు తట్టి లేపేలా వైసీపీ పెద్దల చర్యలు ఉన్నాయని అంటున్నారు.

దాంతో పాటు కొన్ని కీలకమైన కులాలను మంత్రి వర్గంలో అసలు స్థానం లేకుండా చేయడం పట్ల కూడా వారు రగులుతున్నారు. దాంతో ఇపుడు ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఓసీస్ ఒక్కటి అవుతున్నారు. వారి ఓట్లు పోలరైజ్ అవుతున్నాయని చెబుతున్నారు. దానికి నాందిగానే అమలాపురంలో తాజాగా జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనలను చూడాలని కూడా అన్న వారు ఉన్నారు.

సమాజంలో ఏలికలు అందరినీ సమానంగా చూడాలి. అణగారిన వారికి అప్ లిఫ్ట్ ఇవ్వడంతో తప్పు అయితే లేదు, కానీ అదే సమయంలో మిగిలిన వారిని అసలు పట్టించుకోము అంటేనే చిక్కు అంతా వస్తోంది. ఇపుడు వైసీపీ పెద్దలు ఆ రకమైన వివక్ష చూపిస్తున్నారు అని సామాజంలో కొన్ని సెక్షన్లు రగులుతునాయి. మరి వారు కనుక తమ ఓటు సత్తా ఏంటి అన్నది చూపించాలనుకుంటే ఏపీ రాజకీయాలలో కీలకమైన మార్పు రావడం తధ్యం. దాని కోసం తెర వెనక కూడా కొన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రయత్నాలు కూడా సాగుతున్నట్లుగా తెలుస్తోంది.