Begin typing your search above and press return to search.

నాజీల అరాచకానికి కొత్త సాక్ష్యం.. 17.5 టన్నుల చితాభస్మం..ఆస్థికలు!

By:  Tupaki Desk   |   15 July 2022 12:30 PM GMT
నాజీల అరాచకానికి కొత్త సాక్ష్యం.. 17.5 టన్నుల చితాభస్మం..ఆస్థికలు!
X
ప్రపంచ చరిత్రలో మనిషిని మనిషే అత్యంత క్రూరంగా హతమార్చిన సందర్భాలెన్నో ఉన్నాయి. కానీ.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు చేసిన దురాగతాలు.. వారు చేసిన నరమేధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటివరకు బయటకు వచ్చిన వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారు.. ఈ మధ్యన బయటపడుతున్న మరిన్ని సాక్ష్యాలు.. ఆధారాల్ని చూశాక.. వారి నరబలి మరెంత ఎక్కువగా ఉందన్న సందేహాలు ఇప్పుడు వస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది.

తాజాగా ఉత్తర పోలాండ్ లోని సోల్డౌ ప్రాంతంలో.. నాటి నాజీలు ఏర్పాటు చేసిన కాన్సన్ ట్రేషన్ క్యాంప్ ను గుర్తించారు. ఇందులో 8 వేల మంది చితాభస్మాన్ని.. ఆస్థికలను గుర్తించారు. వీరందరిని గుర్తించకుండా ఉండేందుకు వీలుగా ఒక భారీ గోతిలో వేసి.. ఎవరూ గుర్తు పట్టకుండా దహనం చేసినట్లుగా గుర్తించారు.

1939లో కాన్నన్ ట్రేషన్ క్యాంపుల్ని నిర్వహించిన నాజీలు.. తాము తీవ్రంగా వ్యతిరేకించే యూదులు.. పోలీష్ ఉన్నత వర్గాల వ్యతిరేకుల్ని గుర్తించి మరీ దారుణంగా చంపేసినట్లుగా చెబుతున్నారు.

తాజాగా వెల్లడైన ఆధారాల నేపథ్యంలో ఇక్కడ దాదాపు 30 వేల మందిని నాజీలు హతమార్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. సోల్డౌ ప్రాంతంలో రెండు భారీ గోతుల్ని గుర్తించిన పరిశోధకులు.. దాదాపు 17.5 టన్నుల చితాభస్మం.. ఆస్థికల్ని గుర్తించారు. ఒక్కో వ్యక్తి అవశేషాలు రెండు కేజీల బరువు ఉంటాయని.. ఈ లెక్కన 17.5 టన్నుల చితాభస్మం ఎంతమందన్న విషయంపై స్పష్టత వచ్చినట్లేనని చెబుతున్నారు.

పోలాండ్ లో జర్మనీ నాజీలు చేసిన ఆరాచకాలు.. ఆర్థిక నష్టాలను ప్రస్తుతం విలువ కడుతున్నట్లు చెబుతున్న అక్కడి ప్రభుత్వం వల్ల ఒరిగే ప్రయోజనం ఏముండదు. ఎందుకంటే.. నాజీల ఆరాచకాలకు సంబంధించిన పరిహారం చెల్లింపు 1950లోనే ముగిసిన నేపథ్యంలో.. ఇప్పుడు కేవలం వారి దురాగతాలు ఎంత భారీ అన్న విషయాన్ని భవిష్యత్తు తరాలకు మరింత స్పష్టంగా చెప్పేందుకు మాత్రమే సాయపడుతుంది.

ఒక లెక్క ప్రకారం రెండో ప్రపంచ యుద్ధంలో పోలాండ్ కు చెందిన 60 లక్షల మంది ప్రజలు మరణించి ఉంటారని.. అందులో 30 లక్షలు యూదులే అన్న లెక్క ఒకటి ఉంది. ఇలాంటివి బయటపడుతున్న కొద్దీ.. లెక్కలు మారనున్నాయి.