Begin typing your search above and press return to search.

ఏపీ లిక్కర్‌ కిక్‌; టెట్రా ప్యాక్‌ల్లోనూ.. మాల్స్‌లోనూ..!

By:  Tupaki Desk   |   23 Jun 2015 10:03 AM GMT
ఏపీ లిక్కర్‌ కిక్‌; టెట్రా ప్యాక్‌ల్లోనూ.. మాల్స్‌లోనూ..!
X
రెండేళ్ల పాటు కొనసాగే మద్యం పాలసీని ఏపీ సర్కారు వెల్లడించింది. లాటరీల ద్వారా ఎంపిక చేసే ఈ మద్యం దుకాణాల్ని జనాభా ఆధారంగా లైసెన్స్‌ ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించారు. లైసెన్స్‌ ఫీజును కనిష్ఠంగా రూ.30లక్షలు.. గరిష్ఠంగా రూ.65లక్షలుగా నిర్ణయించారు. ఏపీ వ్యాప్తంగా 4,380 షాపుల్ని ఏర్పాటు చేస్తూ దరఖాస్తుల్ని ఆహ్వానించారు.

తాజాగా ప్రకటించిన ఏపీ మద్యం పాలసీలో సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మార్పీకి మద్యాన్ని విక్రయించకుండా ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్న విధానానికి చెక్‌ పెట్టేందుకు వీలుగా.. సర్కారీ మద్యం దుకాణాల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే స్థలాల్ని గుర్తించటం జరిగింది. అయితే.. మొత్తం మద్యం దుకాణాల్లో పది శాతానికి తగ్గకుండా ఉండేలా ఈ సర్కారీ మద్యం దుకాణాల్ని ఏర్పాటు చేయనున్నారు.

లూజు మద్యాన్ని నిరోధించేందుకు వీలుగా.. టెట్రా ప్యాక్‌లను ప్రవేశ పెట్టనున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది. దీంతో.. మద్య వినియోగం మరింత పెరిగే వీలుంది. అంతేకాదు.. పదివేల చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ స్థలంలో ఏర్పాటు చేసే షాపింగ్‌ మాల్స్‌లోనూ మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.

అదే సమయంలో.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించారు. తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు చేపట్టకుండా చర్యలు తీసుకోనున్నారు. ఏపీలోని త్రీస్టార్‌.. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలోని బార్‌లు.. క్లబ్‌లు.. టూరిజం హోటళ్లు.. రిసార్టులలో ఏడాదికి ఒకసారి లైసెన్సులను రెన్యువల్‌ చేసుకోవాలని నిర్ణయంచారు. కొత్త మద్యం పాలసీ కారణంగా.. గత ఏడాది కంటే ఈ ఏడాది 20శాతం అధికంగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి మద్య నియంత్రణ నిర్వహిస్తామని చెప్పిన బాబు సర్కారు.. ఏపీ ప్రజల్లో కిక్కు పెంచి.. కాసులు దండుకోవాలని భావిస్తోన్నట్లు తాజా విధానం చెప్పకనే చెప్పేస్తుంది.