Begin typing your search above and press return to search.

చేరిక‌లు.. ఎన్నిక‌లు.. దీదీలో కొత్త ఉత్స‌హం

By:  Tupaki Desk   |   5 Sep 2021 11:30 AM GMT
చేరిక‌లు.. ఎన్నిక‌లు.. దీదీలో కొత్త ఉత్స‌హం
X
ఈ ఏడాది ప‌శ్చిమ బెంగాల్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌వాలుకు ఎదురు నిలిచిన తృణ‌ముల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ వ‌రుస‌గా మూడో సారి ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించారు. మోడీ, అమిత్ షా వ్యూహాల‌ను ప‌డ‌గొట్టి మ‌రీ త‌న పార్టీని గెలిపించిన ఆమె దేశాన్ని త‌న‌వైపున‌కు తిప్పుకున్నారు. ఎన్నిక‌లకు ముందు త‌న పార్టీలోని కీల‌క నేత‌ల‌ను బీజేపీ లాగేసుకున్నా.. ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదురైనా బెద‌ర‌ని దీదీ ఎన్నిక‌ల్లో పార్టీకి ఘ‌న విజ‌యాన్ని అందించారు.

కానీ ఆమె పోటీ చేసిన నందిగ్రామ్ మాత్రం సువేందు అధికారి చేతిలో కేవ‌లం 1700 ఓట్ల తేడాతో మ‌మ‌తా ఓడిపోయారు. దీంతో ఆమె ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఆరు నెల‌ల్లోపు ఎన్నిక‌ల్లో నిల‌బ‌డి ఎమ్మెల్యేగా గెల‌వాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. ఆమె పోటీ చేయ‌డం కోసం భ‌వానీపురం నుంచి గెలిచిన ఎమ్మెల్యే శోభ‌న్ దేవ్ చ‌టోపాధ్యా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇప్పుడా స్థానంతో పాటు ఆ రాష్ట్రంలోని మ‌రో రెండు స్థానాల‌కు సెప్టెంబ‌ర్ 30న ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది.

దీంతో భ‌వానీపురం నుంచి ఆమె పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం సాధించిన ఆమె ఈ సారి కూడా అల‌వోక‌గా గెలిచే అవ‌కాశ‌ముంద‌ని నిపుణులు అంటున్నారు. త‌న‌కు కంచుకోట అయిన భ‌వానీపురంలో ఆమెకు ఎదురు నిలిచి ఏ పార్టీ నిల‌బ‌డ‌లేద‌ని చెప్తున్నారు. ఈ నేప‌థ్యంలో దీదీకి పోటీగా బీజేపీ బ‌ల‌మైన అభ్య‌ర్థినే బ‌రిలో దించే వీలుంది. అయిన‌ప్ప‌టికీ ఆమె విజ‌యంపై ఎలాంటి అనుమానాలు లేవు. కానీ దీదీని అంత ఈజీగా బీజేపీ గెల‌వ‌నిస్తుందా? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. కానీ ప‌రిస్థితులు ఎలా మారినా ఇక్క‌డి నుంచి దీదీ విజ‌యాన్ని ఆప‌డం బీజేపీకి సాధ్యం కాద‌నే అభిప్రాయాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఉప ఎన్నిక ప్ర‌క‌ట‌న‌తో బెంగాల్‌లో రాజ‌కీయాలు మ‌రోసారి వేడెక్క‌నున్నాయి.

ఇక మ‌రోవైపు శాస‌న‌స‌భ ఎన్నిక‌లకు ముందు తృణ‌ముల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన ఆ పార్టీ నాయ‌కులు ఇప్పుడు తిరిగి సొంతగూటికి చేరుతుండ‌డం కూడా దీదీలో కొత్త హుషారు నింపుతోంది. బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రిగా మళ్లీ మ‌మ‌త ద‌గ్గ‌రికి చేరుకుంటున్నారు. తాజ‌గా క‌లియాగంజ్ ఎమ్మెల్యే సౌమేన్ రాయ్ తిరిగి తృణ‌ముల్ కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరి గెలిచిన ఆయ‌న ఇప్పుడు సొంత గూటికే వ‌చ్చారు. దీంతో అసెంబ్లీలో బీజేపీ బ‌లం 71కి ప‌డిపోయింది. గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలోనే న‌లుగురు బీజేపీ ఎమ్మెల్యేలు దీదీ చెంత చేరారు. ఈ నేప‌థ్యంలో బెంగాల్‌లో దీదీకి పోటీగా వెళ్లి బ‌లాన్ని చాటాల‌నుకున్న బీజేపీకి ఇప్పుడు మ‌రిన్ని క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయి.