Begin typing your search above and press return to search.

ఢిల్లీకి కొత్త భయం.. ఉగ్రదాడికి ఛాన్స్ అంటూ హెచ్చరికలు

By:  Tupaki Desk   |   22 Jun 2020 9:00 AM IST
ఢిల్లీకి కొత్త భయం.. ఉగ్రదాడికి ఛాన్స్ అంటూ హెచ్చరికలు
X
ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి రోగం.. దేశాన్ని కుదిపేస్తోంది. మొదట్లో లాక్ డౌన్ కట్టడితో మహమ్మారికి చెక్ పెట్టినట్లు కనిపించినా.. లాక్ డౌన్ సడలింపులతో కొత్త సమస్యలు తెర మీదకు రావటమే కాదు.. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న వైనం తెలిసిందే. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. చివరకు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా పలువురు పాజిటివ్ కు గురి కావటం చూస్తే.. ఢిల్లీలో ఎలాంటి పరిస్థితి నెలకొందో ఇట్టే అర్థమైపోతుంది.

ఇలాంటివేళ.. దేశ రాజధాని భద్రతపై నిఘా వర్గాలు జారీ చేసిన హెచ్చరిక ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాద దాడులకు అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్సు వర్గాలు జారీ చేసిన వార్నింగ్ ఢిల్లీ వాసులకు మరో కొత్త అలజడికి కారణంగా మారింది. ఢిల్లీలో ఉగ్రదాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయని.. బస్సు.. కారు లేదంటే టాక్సీ ద్వారా వారు దేశ రాజధానిలోకి ప్రవేశించొచ్చని సమాచారం అందినట్లు పేర్కొన్నారు.

తమకు అందిన సమాచారం నేపథ్యంలో నిఘాను మరింత పెంచటంతో పాటు.. తనిఖీలను ముమ్మరం చేశారు. హోటళ్లు.. గెస్ట్ మౌస్ లు.. బస్సు టెర్మినల్స్.. రైల్వేస్టేషన్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. అనుమానం వచ్చిన ప్రతిచోట వెతుకుతున్నారు. ఢిల్లీతో పాటు.. శివారు ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని అలెర్టు చేశారు. ఉగ్రదాడి జరగకుండా చేసేందుకు భద్రతా సంస్థలు విపరీతంగా శ్రమిస్తున్నాయి. మహమ్మారి దెబ్బకు వణుకుతున్న దేశ రాజధానికి ఉగ్రదాడి హెచ్చరిక ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.