Begin typing your search above and press return to search.

ఆ ఒక్క మీటింగ్ సక్సెస్ అయితే..వీకెండ్ లో సర్కారు?

By:  Tupaki Desk   |   21 Nov 2019 11:05 AM GMT
ఆ ఒక్క మీటింగ్ సక్సెస్ అయితే..వీకెండ్ లో సర్కారు?
X
ఎన్నికల ఫలితాలు విడుదలై.. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ రాని వైనం తెలిసిందే. ఎన్నికల వేళలో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన బీజేపీ.. శివసేనల మధ్య అధికార పంపిణీ లెక్కలు తేలకపోవటంతో పంచాయితీ మొదలైంది. అది అంతకంతకూ పెరిగిపోవటమే చివరకు అంచనాలకు భిన్నంగా ఎన్సీపీ.. కాంగ్రెస్ పార్టీలతో జత కట్టేందుకు శివసేన సిద్ధమవుతోంది.

సినిమాటిక్ మలుపుల అనంతరం మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించిన సంప్రదింపుల పర్వం జోరందుకుంది. దీనికి తగ్గట్లే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. తాము స్వీట్లు ఆర్డర్ ఇచ్చినట్లుగా చెప్పి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విషయాన్ని చెప్పారు.

అయితే.. ఆయన చెప్పినంత ఈజీగా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదంటున్నారు. ఇప్పటికే అధికార పంపిణీ.. పదవుల పందేరం విషయంలో మూడు పార్టీల మధ్య ఒక అవగాహన వచ్చినప్పటికీ.. ఈ మూడు పార్టీల సంయుక్త సమావేశం ముంబయిలో జరగనుంది. ఆ సమావేశం కానీ ఫలప్రదం అయిన పక్షంలో ప్రభుత్వం కొలువు తీరటం ఖాయమంటున్నారు.

ఇప్పటివరకూ ఉన్న దాని ప్రకారం శివసేన.. ఎన్సీపీలు చెరో రెండున్నర సంవత్సరాల పాటు సీఎం పదవిని పంచుకోవాలని.. కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం పదవిని ఐదేళ్ల పాటు చేపట్టాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఏ పార్టీకి ఎన్ని మంత్రిపదవులు అన్న విషయంలోనూ స్పష్టత వచ్చిందో చెబుతున్నారు.

మతతత్వ పోకడలపై పోరాడే క్రమంలో బీజేపీని ధీటుగా ఎదుర్కొందుకు మూడు పార్టీలతో కూడిన ప్రభుత్వానికి కాంగ్రెస్ అధినేత సోనియా ఓకే చెప్పారని చెబుతున్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అయినప్పుడు శివసేన కాకపోవటం ఏమిటో? ఇదంతా ఒక ఎత్తు అయితే.. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ వీకెండ్ లో మూడు పార్టీలతో కూడిన ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందని చెబుతున్నారు.