Begin typing your search above and press return to search.

తెలంగాణకు కొత్త గవర్నర్..! మాజీ సీఎంకే అవకాశం..?

By:  Tupaki Desk   |   24 Aug 2021 8:30 AM GMT
తెలంగాణకు కొత్త గవర్నర్..! మాజీ సీఎంకే అవకాశం..?
X
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2024 వరకు ఒక్కరే గవర్నర్ గా కొనసాగాలని నిబంధన ఉంది. కానీ 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఐదేళ్లపాటు ఉమ్మడి గవర్నర్ గా నరసింహం కొనసాగారు. ఆ తరువాత 2019లో రెండు రాష్ట్రాలకు విడివిడిగా గవర్నర్లు వచ్చారు. తెలంగాణలో నరసింహం వెళ్లిన తరువాత తమిళ సై నియమితులయ్యారు. అయితే ఇప్పుడు ఆమె పాండిచ్చేరి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కేంద్రంలో నిర్వహించిన సమావేశాల్లో తెలంగాణ గవర్నర్ ను మార్చాలన్న ప్రతిపాదన వచ్చింది. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నట్లు సమాచారం.

2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్ గా తమిళ సై బాధ్యతలు చేపట్టారు. తమిళనాడుకు చెందిన ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి కృషి చేయడంతో అమె పనితీరును గుర్తించిన కేంద్రం ఆమెకు తెలంగాణ గవర్నర్ గా అవకాశం ఇచ్చారు. అయితే తెలంగాణలో గవర్నర్ గా నియమితులైనప్పటి నుంచి తమిళ సై ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలతో సంయమనంగా మెదిలారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చారు.

అయితే తమిళ సై పాండిచ్చేరి కి ఇన్ చార్జి గవర్నర్ గా కొనసాగుతున్నారు. దీంతో అక్కడి పూర్తి బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే తెలంగాణకు కొత్తగా యడ్యూరప్పను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగారు. 75 సంవత్సరాల దాటిన తరువాత అధికారంలో కొనసాగొద్దనే నిబంధనతో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని కేంద్రం అప్పుడే మాటిచ్చింది. అనుకున్నట్లుగానే అయనకు తెలంగాణ గవర్నర్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఆర్ఎస్ఎస్ విభాగానికి చెందిన యడ్యూరప్ప 1970 లో విద్యార్థి దశ నుంచే పనిచేస్తున్నారు. అక్కడి నుంచి పార్టీలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించి సీఎం స్థాయికి ఎదిగారు. కర్ణాటక రాష్ట్రానికి ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మూడుసార్లు విపక్ష నేతగా కొనసాగారు. కొన్నాళ్ల కిందట బీజేపీ నుంచి బయటకు వెళ్లిన ఆయన సొంత పార్టీ పెట్టారు. అయితే అది సక్సెస్ కాకపోవడంతో తిరిగొ సొంత గూటికి చేరుకున్నారు. బీజేపీ కోసం కష్టపడేవారిలో యడ్యూరప్ప కూడా ఉండడంతో ఆయనకు సముచిత స్థానం కల్పించాలని కేంద్రం భావిస్తోంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత పనిచేసిన గవర్నర్లు తమిళనాడుకు చెందిన వారు. అంతకుముందు పనిచేసిన నరసింహం , తమిళ సై ఇద్దరూ పక్క రాష్ట్రానికి చెందిన వారే. ఇప్పుడు యడ్యూరప్ప కూడా తెలంగాణతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే కావడం ఆసక్తిగా మారింది. దీంతో పొరుగు రాష్ట్రానికి చెందిన వారైతే రాజకీయాలపై ఎక్కువగా పట్టు సాధించే అవకాశం ఉంటుందని కేంద్రం సమాలోచనలు చేస్తోంది.

ఇప్పటి వరకు వచ్చిన గవర్నర్ల కంటే ఇప్పుడు వచ్చే గవర్నర్ ప్రత్యేకత ఉంది. నాలుగు సార్లు సీఎంగా చేసిన వ్యక్తికి తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు అప్పగిస్తుండడంపై ఆసక్తి చర్చ సాగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తే. దీంతో తెలంగాణలో పార్టీ పటిష్టతకు కొన్ని వ్యవహారాలకు కేంద్రం యడ్యూరప్పను నియమిస్తుందా..? అనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ దూకుడు పెంచుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీకి యడ్యూరప్ప నియామకం కలిసివస్తుందా..? అని అనుకుంటున్నారు. మరోవైపు ఆర్ ఎస్ ఎస్ వ్యక్తి గవర్నర్ గా రావడంతో ఆ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.