Begin typing your search above and press return to search.

రెస్టారెంట్లకు కొత్త గైడ్ లైన్స్.. విడుదల చేసిన కేంద్రం

By:  Tupaki Desk   |   9 March 2021 3:30 PM GMT
రెస్టారెంట్లకు కొత్త గైడ్ లైన్స్.. విడుదల చేసిన కేంద్రం
X
దాదాపు ఏడాది క్రితం దేశ ప్రజలకు పరిమితమైన లాక్ డౌన్ మిగిల్చిన అనుభవాలు అన్నిఇన్ని కావు. ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ నుంచి అన్ లాక్ వరకు అన్ని దశల్ని చూశాం. అన్ లాక్ లోనూ ఒక్కో దశను దాటి.. అంతా సాధారణం అవుతుందన్న వేళ కొత్త కేసులు మళ్లీ ఎక్కువ అవుతున్నాయి. దేశం మొత్తం ఇలాంటి పరిస్థితి లేకున్నా.. ఆరు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. దేశం మొత్తంలో నమోదవుతున్న కేసుల్లో 85 శాతం కేసులు ఇక్కడే ఉండటం చూస్తే.. తీవ్రత ఎంత ఉందన్న విషయం అర్థమవుతుంది.

అంతకంతకూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది కేంద్ర సర్కారు. ముఖ్యంగా రెస్టారెంట్ల వద్ద అనుసరించాల్సిన విధివిధానలపై స్పష్టతను ఇచ్చింది. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్న వేళ.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే.. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదంటే.. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మార్చి ఒక నుంచి అనుసరించాల్సిన విధివిధానాల గురించి కేంద్రం తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంటూ పోస్టు చేసింది. అందులోని అంశాల్ని చూస్తే..

- రెస్టారెంట్లోనే తినే బదులుగా ఇంటికి తీసుకెళ్లే (టేక్ అవే) పద్దతిని ప్రోత్సహించండి. జాగ్రత్తలు తీసుకుంటూ పుడ్ డెలివరీ విధానాన్ని అమలు చేయండి.

- రెస్టారెంట్ ఎంట్రీ వద్ద శానిటైజర్ డిస్పెన్సర్.. థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి.

- కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే లోపలకు అనుమతించాలి.

- రెస్టారెంట్లోని సిబ్బంది అంతా మాస్కులు, కవర్లు ధరించడం తప్పనిసరి. లోపల ఉన్నంత సేపు వీటిని తీయకూడదు.

- అదనపు సీటింగ్ సామర్థ్యంతో పాటు వెయిటింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలి. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలి.

- కస్టమర్లు.. సిబ్బంది.. వారి వస్తువుల్ని తీసుకెళ్లేందుకు వీలుగా ప్రత్యేక ఎంట్రీ.. ఎగ్జిట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి

- రెస్టారెంట్ లోపల క్యూలో కనీసం ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలి
- తగినంత భౌతిక దూరం ఉండే విధంగా సీటింగ్ అరెంజ్ మెంట్ ఉండాలి.

- డిస్పోజబుల్ మెనూలు, నాణ్యత గల కాగితపు న్యాప్ కిన్స్ ఉపయోగించాలి.

- సామాజిక దూరం పాటించేలా వినియోగదారులకు బఫే సర్వీస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

- ఎలివేటర్లలో వ్యక్తుల సంఖ్య పరిమితం చేయాలి. వారంతా తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాలి.

- ఆయా రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతం విధానాలకు అనుగుణంగా సమావేశాలు, భేటీలు నిర్వహించాలి.

- కాంటాక్ట్ లెస్ మోడ్ ఆఫ్ ఆర్డర్.. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలి.