Begin typing your search above and press return to search.

పంచాయతీ కార్యదర్శులకు అదనపు బాధ్యతలు

By:  Tupaki Desk   |   15 Dec 2018 7:49 AM GMT
పంచాయతీ కార్యదర్శులకు అదనపు బాధ్యతలు
X
పంచాయతీ ఎన్నికలను త్వరగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల విధులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో పంచాయతీ కార్యదర్శులు 64 బాధ్యతలు నిర్వహించేవారు. వీటిని అదనంగా మరో 30 విధులను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది.

2018-పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం కార్యదర్శి గ్రామపంచాయతీలో పాలన బాధ్యతలను నిర్వహించడంతోపాటు సర్పంచ్ ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుంది. పంచాయతీలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ, తాగునీరు, వీధిదీపాలు - రోడ్లు - డ్రేనేజీ - మొక్కలు నాటడం. పారిశుధ్య కార్యక్రమాలను అమలు చేయాలి. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 42 - సెక్షన్ 286 ప్రకారం - సెక్షన్ 43 ప్రకారం ప్రభుత్వం అప్పగించిన అన్ని బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా సెక్షన్-6(8)లో ప్రకారం పంచాయతీ ఏజెండా రూపకల్పన బాధ్యత కార్యదర్శిపైనే ఉంటుంది. గ్రామ పాలకవర్గం ఆదేశంతో వీటిని అమలు చేయాలని సూచించింది.

త్వరతగతిన భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా భవన నిర్మాణాలకు 24గంటల్లోనే, లేఅవుట్లకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏడు రోజుల్లో అనుమతి లభించనుంది. లేఅవుట్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతీ లేఅవుట్ లో 15శాతం భూభాగాన్ని తనఖా చేయాలని ఆదేశాలున్నాయి. అలాగే గ్రామంలో తీసుకునే నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించింది. జనన, మరణాలతోపాటు వివాహా రిజిస్టేషన్ల నిర్వహణ కార్యదర్శి నిర్వర్తించాల్సి ఉంటుంది.

*ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే..

- పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వానికి సబార్డినేట్ గా వ్యహరించాలి.

-గ్రామ సభకు ఏజెండా తయారుచేసి అందులోని అంశాలను సభ్యులకు తెలిసేలా ప్రచారం చేయాలి.

-ప్రతీ మూడునెలలకు ఒకసారి ఖర్చు లెక్కలను పంచాయతీ ఆమోదానికి సమర్పించాలి.

-వరదలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు, రోడ్లు, రైలు ప్రమాదాలు సంభవించినపుడు సహాయ చర్యల్లో పాల్గొనాలి.

-గ్రామంలో వ్యాధులు ప్రబలినప్పుడు అధికారులకు తెలియపర్చాలి.

- గ్రామసభ లబ్ధిదారుల గుర్తింపు, వారికి రుణ పంపిణీ, రుణాల వసూలకు సహకరించాలి.

-అంశాల వారగీ ఏజెండాలను సిద్ధంచేసి పంచాయతీ ఆమోదం పొందేలా చేయడం.

-ఏజెండాను ప్రదర్శించడం, దండోరా వేయించడం, గ్రామాల్లో అందరికీ తెలిసేలా పలు ప్రాంతాల్లో నోటీసులు అంటించడం చేయాలి.

-గ్రామాల్లో అవసరాలను గుర్తించి గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారీలో పాలుపంచుకోవాలి. అలాగే ఎంపీపీ - ఎంపీడీఓ - ఈవో(పీఆర్ ఆర్డీ) నిర్వహించే నెలవారీ సమావేశాలకు హాజరు కావాలి.

-బలహీన వర్గాలు - ఎస్సీ - ఎస్టీ వాడల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలు, పంచాయతీ తీసుకుంటున్న ఫలాలు అందేలా చూడటం

-వార్షిక పరిపాలన నివేదిక రూపొందించి పంచాయతీ ఆమోదం తీసుకోవడం.

-నెలవారీ సమీక్షలు - ప్రగతి నివేదికల రూపకల్పన - ఉన్నతాధికారులకు నివేదిక అందించడం, సర్పంచ్ లతో కలిసి అభివృద్ధి పనులను పర్యవేక్షించడం.

-ప్రతీ త్రైమాసికంలో ఒకసారి పంచాయతీ ఆర్థిక వ్యవహారాలను - ఆదాయ వ్యయ వివరాలను పంచాయతీ ఆమోదించడంతోపాటు ఈవీపీఆర్డీలకు సమాచారం ఇవ్వడం.