Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్ర ఫలితంతో పీకే అస్త్రసన్యాసం తప్పదా?

By:  Tupaki Desk   |   30 April 2021 3:29 AM GMT
ఆ రాష్ట్ర ఫలితంతో పీకే అస్త్రసన్యాసం తప్పదా?
X
దేశ రాజకీయాల్లో సరికొత్త ఛరిష్మా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సొంతం. ఆ మాటకు వస్తే.. రాజకీయ వ్యూహకర్త అనే పదాన్ని బిజినెస్ మోడ్ లో సక్సెస్ ఫుల్ గా మార్చుకోవటంతో పాటు.. పలువురు ముఖ్యమంత్రులు.. ఆయా రాష్ట్రాలకు సీఎంలు కావాలనుకున్న నేతలంతా ఆయన్ను సంప్రదించటం.. ఆయన్ను తమ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవటం కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పటివరకు తాను పని చేసిన పార్టీని పవర్లోకి తీసుకొచ్చిన అరుదైన ట్రాక్ రికార్డు ఆయన సొంతం.

గతంలో మరే రాష్ట్రంలో ఎదురుకాని ఇబ్బందికర పరిస్థితిని ఆయన పశ్చిమబెంగాల్ లో ఎదుర్కొంటున్నారు. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పలితాలు మే రెండున వెల్లడికానున్నాయి. నిన్న (గురువారం) జరిగిన తుది పోలింగ్ తో ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న సుదీర్ఘమైన పోలింగ్ ప్రాసెస్ ముగిసినట్లైంది. పోలింగ్ పూర్తి అయ్యిందో లేదో పలు సంస్థలు.. మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి.

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వెల్లడైనప్పటికి అందరి చూపు మాత్రం పశ్చిమ బెంగాల్ మీదనే ఉన్నాయి. ఒకట్రెండు మీడియా సంస్థలు బీజేపీకి అధికారం ఖాయమన్న ఊహాగానాలు వ్యక్తం చేస్తే.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బెనర్జీ చేతికి అధికారం ఖాయమని.. ఆమె ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. అయితే.. గతంతో పోలిస్తే.. ఆమె అధిక్యత తగ్గనున్న విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.

అధికారంలోకి టీఎంసీ వచ్చినప్పటికి.. బీజేపీ తన బలాన్ని భారీగా పెంచుకుంటుందన్న విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇదే.. ప్రశాంత్ కిశోర్ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మార్చనున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. పశ్చిమబెంగాల్ లో టీఎంసీ అధికారంలోకి రావటం ఖాయమని.. బీజేపీకి మూడెంకల సీట్లు రావటం అసాధ్యమని గతంలో తేల్చి చెప్పారు. అక్కడితో ఆగితే బాగుండేది. కానీ.. ఇక్కడే ఆయన నోటి నుంచి కీలక ప్రకటన చేశారు.

బీజేపీకి కనుక మూడెంకల సీట్లను సొంతం చేసుకుంటే తాను రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించనని.. అస్త్రసన్యాసం చేస్తానని ప్రకటించారు. ఇప్పుడీ సవాలే ఆయనకు తలనొప్పిగా మారనుంది. ఇప్పటివరకు వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకి వందకు పైనే సీట్లు ఖాయమని.. అధికారాన్ని చేపట్టటానికి అవసరమైన 147 స్థానాలు రావని.. మెజార్టీకి దగ్గరకు వచ్చి ఆగిపోతాయరని పేర్కొంటున్నారు. దీంతో పీకే ఫ్యూచర్ మీద కొత్త చర్చ మొదలైంది. ఇచ్చిన మాటకు తగ్గట్లే రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించటం మానేస్తారా? రాజకీయ నేతల మాదిరి..అంతా తూచ్ అన్నట్లుగా ఏదో ఒకటి చెప్పేస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.