Begin typing your search above and press return to search.

న‌వ్యాంధ్ర‌లో మ‌ద్యం గోల మొద‌లైందిగా!

By:  Tupaki Desk   |   2 July 2017 10:01 AM GMT
న‌వ్యాంధ్ర‌లో మ‌ద్యం గోల మొద‌లైందిగా!
X
ఏపీలో మ‌ద్యం షాపుల గోల మొద‌లైపోయింది. నిన్న రాష్ట్రంలో కొత్త మ‌ద్యం పాల‌సీ అమ‌ల్లోకి వ‌చ్చేసింది. ఈ క్ర‌మంలో చాలా ప్రాంతాల్లో మ‌ద్యం షాపులు అస‌లు తెరుచుకున్న దాఖ‌లా క‌నిపించ‌లేదు. జీఎస్టీ ప్రారంభం, కొత్త మ‌ద్యం పాల‌సీ ఒకే ద‌పా అమ‌ల్లోకి వ‌చ్చిన నేప‌థ్యంలో చాలా ప్రాంతాల్లో మ‌ద్యం షాపుల ప్రారంభానికి అవ‌రోధాలు ఎదురైన‌ట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి. అయితే మ‌ద్యం దుకాణాలు, బార్ల నుంచి వ‌స్తున్న‌ భారీ లాభాల‌ను వ‌దులుకునేందుకు ఎవ‌రు మాత్రం ఆల‌స్యం చేస్తారు చెప్పండి. ఇక్క‌డ కూడా అదే త‌ర‌హా ధోర‌ణి క‌నిపించింద‌నే చెప్పాలి.

ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన కొత్త మ‌ద్యం పాల‌సీ ప్ర‌కారం వైన్ షాపుల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఏర్పాటు చేసేందుకు మ‌ద్యం వ్యాపారులు స‌న్నాహాలు మొద‌లుపెట్టారు. ఇందులో భాగంగా మ‌ద్యం పాల‌సీలోని కొన్ని నిబంధ‌ల‌ను అతిక్ర‌మిస్తూ వ్యాపారులు షాపుల‌ను ఏర్పాటు చేసేందుకు య‌త్నించారు. ఈ క్ర‌మంలో వ్యాపారుల దురాశ‌ను గ‌మ‌నించిన స్థానికులు ఎక్క‌డికక్క‌డ వ్యాపారుల‌కు చుక్క‌లు చూపేందుకు రంగంలోకి దిగారు. న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తికి కూత‌వేటు దూరంలో ఉన్న విజ‌య‌వాడ శివారు ప్రాంతం ఎనికేపాడులో ఇళ్ల మ‌ధ్య‌నే వైన్ షాపును ఏర్పాటు చేసేందుకు య‌త్నించిన ఓ వ్యాపారిని స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో మ‌ద్యం వ్యాపారికి - స్థానికులకు పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. విష‌యం తెలుసుకున్న మ‌హిళా సంఘాలు - ప‌లు ప్ర‌జా సంఘాలు అక్క‌డికి చేరుకుని నిబంధ‌న‌ల అతిక్ర‌మ‌ణ‌ను చూపిస్తూ మ‌ద్యం వ్యాపారిని అడ్డుకున్నాయి. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది.

మ‌రోవైపు తూర్పుగోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రంలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి నెల‌కొంది. మ‌ద్యం లాభాల గురించి తెలిసిన ఓ వ్యాపారి అక్క‌డ అనుమ‌తి లేకున్నా అన‌ధికారికంగా ఓ మ‌ద్యం షాపును ఏర్పాటు చేసేందుకు య‌త్నించాడు. అయితే అక్క‌డ కూడా రంగంలోకి దిగిన మ‌హిళ‌లు... స‌ద‌రు మ‌ద్యం షాపును ఎత్తివేయాల‌ని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళ‌న‌కు దిగారు. ఇక విజ‌యన‌గ‌రం జిల్లా డెంకాడ‌లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వైన్ షాపును వ్య‌తిరేకించిన మ‌హిళ‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన వామ‌ప‌క్షాల నేత‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య తోపులాట చోటుచేసుకోగా... ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సీపీఎం కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్‌ కు త‌ర‌లించారు. ఇదే త‌ర‌హా ప‌రిస్థితులు దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ నెల‌కొన్న‌ట్లు స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/