Begin typing your search above and press return to search.

కొత్త మెరుపులు: అబ్దుల్లా.. పాల్.. నీతు.. భవినా.. సోనాల్ బెన్.. అమిత్.. నిఖత్

By:  Tupaki Desk   |   8 Aug 2022 6:32 AM GMT
కొత్త మెరుపులు: అబ్దుల్లా.. పాల్.. నీతు.. భవినా.. సోనాల్ బెన్.. అమిత్.. నిఖత్
X
కిడాంబి శ్రీకాంత్.. దీపికా పళ్లికల్.. నిఖత్ జరీన్ అన్నంతనే గుర్తు పట్టేయొచ్చు. కానీ.. ఎల్డోన్ పాల్.. భవినా బెన్ పటేల్.. అబ్దుల్లా అబూబాకర్‌.. సొనాల్‌ బెన్‌ మనూభాయ్‌ పటేల్‌.. ఇలాంటి పేర్లు చాలామంది ఇప్పటివరకు విని ఉండరు.కానీ.. వీరంతా దేశ ప్రతిష్ఠను పెంచేందుకు.. అంతర్జాతీయ వేదిక మీద భారత్ సత్తా చాటేందుకు పడే తపన అంతా ఇంతాకాదు. తాజాగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసి.. పతకాల పంట పండించిన వీరంతా సో స్పెషల్ అనే చెప్పాలి.

ఆదివారం జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత అథ్లెట్ సభ్యులు తమ సత్తా చాటారు. ఈ ఒక్కరోజులోనే ఏకంగా 13 పతకాలు రాగా.. వాటిల్లో ఐదు స్వర్ణ పతకాలు కావటం విశేషంగా చెప్పాలి. అందుకే.. పేర్లు పెద్దగా పరిచయం లేని.. మీడియాలో పెద్దగా కనిపించని వీరందరికి దేశ ప్రజలంతా థ్యాంక్స్ చెప్పాల్సిందే. వీరి పేర్లు మిగిలిన వారికి భిన్నంగా.. విజేతలన్న విషయాన్ని మర్చిపోకూడదు.

బ్యాడ్ లక్ ఏమంటే.. దేశంలో క్రికెట్ తప్పించి మరే క్రీడకు పెద్దగా ఆదరణ లేదు. లియాండర్ పేస్.. మహేశ్ భూపతి.. సానియా మీర్జా వల్ల టెన్నిస్ కు.. సైనా నెహ్వాల్.. సింధూరి..కిడాంబి శ్రీకాంత్ లాంటి వారి కారణంగా బ్యాడ్మింటన్ క్రీడలకు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం లభిస్తోంది. ఇలాంటివేళ.. భారత అథ్లెట్లు అదరగొట్టేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తాజాగా పతకాల పంట పండించిన క్రీడాకారులు.. వారు ఆడే క్రీడ ఏమిటన్నది చాలామందికి తెలీదు. వీరు సాధించిన విజయం నేపథ్యంలో మనం వారికి సంబంధించిన వివరాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాగా పరిచయం ఉన్న పేర్లను చివర్లో చెప్పి.. పెద్దగా పరిచయం లేని.. ప్రాచుర్యం లభించని పేర్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా చూసినప్పుడు.. ఎల్డోస్ పాల్.. అబ్దుల్లా అబూబాకర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరూ తమ ఆటతో హిస్టరీ క్రియేట్ చేశారు. వీరిద్దరూ ట్రిపుల్ జంప్ క్రీడను ఆడుతుంటారు.

ఈసారి వీరు సాధించిన ఆరుదైన రికార్డు గురించి తెలిసినంతనే వావ్ అనకుండా ఉండలేం. ఇంతకు ముందు జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ట్రిపుల్ జంప్ లో భారత్ నాలుగు పతకాల్ని సాధించింది. అయితే.. ఎప్పుడూ కూడా మనోళ్లు ఇద్దరు మొదటి.. రెండో స్థానాల్లో నిలిచింది లేదు. ఈసారి అలాంటి పరిస్థితి చోటు చేసుకోవటం విశేషం.

భవినా బెన్ పటేల్ విషయానికి వస్తే ఆమె భారత స్టార్ పారా టీటీ క్రీడాకారిణి. కామన్వ్ ల్త్ పోటీల్లో భాగంగా జరిగిన మహిళల సింగిల్స్ లో స్వర్ణాన్ని సాధించింది. 35 ఏళ్ల భవినా టోక్యో పారాలింపిక్స్ లో రజతం నెగ్గింది. మహిళా సింగిల్స్ కేటగిరిలో సొనాల్ బెన్ మనూభాయ్ పటేల్ కాంస్యాన్ని సొంతం చేుకుంది. బాక్సింగ్ విభాగంలో బాక్సర్లు అమిత్ పంగల్.. నీతూ ఘంగాస్ లు పసిడి పతకాల్ని సొంతం చేసుకున్నారు. పురుషుల 51 కేజీల విబాగంలో అమిత్ పసిడిని సొంతం చేసుకోగా.. 48 కేజీల కేటగిరిలో 21 ఏళ్ల నీతూ ఘంగాన్ తొలిసారి కామన్వెల్త్ పోటీల్లో పాల్గొంటున్న ఆమె తన పవర్ ఫుల్ పంచ్ లతో 2019 ప్రపంచ చాంపియన్ షిప్ కాంస్య పతక విజేతను ఓడించటం విశేషం.

ఇక.. బ్యాడ్మింటన్ పోటీల్లో పీవీ సింధు.. లక్ష్యసేన్.. డుబల్స్ లో సాత్విక్ - చిరాగ్ జోడి ఫైనల్స్ కు దూసుకెళ్లగా.. కిడాంబి శ్రీకాంత్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. తెలుగమ్మాయ్.. తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ మరోసారి అంతర్జాతీయ వేదిక మీద మెరిసారు. ఈ మధ్యనే ప్రపంచ చాంపియన్ గా నిలిచిన ఆమె కామన్వ్ ల్త్ పోటీల్లో తన సత్తా చాటింది. మహిళల 50 కేజీల విభాగంలో తన ప్రత్యర్థిని వరుస పంచ్ లతో హడలెత్తించింది. అదెంతగా అంటే.. కేవలం తొమ్మిదంటే తొమ్మిది నిమిషాలు ముగిసేసరికి.. విజేతగా ఆమెను ప్రకటించాల్సి వచ్చింది. ఆమె ఎంత అద్భుతంగా ఆడిందన్న దానికి ఇదే పెద్ద నిదర్శనంగా చెప్పొచ్చు. ఇప్పటివరకు తెలిసిన క్రికెట్.. బ్యాడ్మింటన్.. టెన్నిస్ స్టార్లతో పాటు.. ఈ అథ్లెట్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.