Begin typing your search above and press return to search.

కరోనాకు ఏపీలో కొత్త ఔషధం.. తరలివస్తున్న జనం..!

By:  Tupaki Desk   |   17 May 2021 12:52 PM GMT
కరోనాకు ఏపీలో కొత్త ఔషధం.. తరలివస్తున్న జనం..!
X
కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మహమ్మారి ఏడాది కాలంగా భయపెడుతోంది. కాగా దీని నుంచి విముక్తి పొందడానికి ఎవరికి తెల్సింది వారు చెబుతున్నారు. ఎవరికి వచ్చింది వారు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వీటికి సంబంధించిన అనేక అంశాలు వైరల్ గా మారాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ఓ గ్రామంలో కరోనాకు మందు కనుగొన్నారు. దానికోసం జనం తరలివస్తున్నారు. ఇంతకీ ఆ ఔషధం ఎంతవరకు పనిచేస్తుంది అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఓ ఆయుర్వేద మూలిక ప్రస్తుతం ఆ సంచలనంగా మారింది. వివిధ రకాల ఆకులు, పొడులతో తయారు చేసిన ఔషధాన్ని ఉచితంగా అందిస్తున్నారు. ఆయుర్వేద గుణాలు కలిగిన ఆకులు, శొంఠి, మిరియాలు, తేనె, అల్లం, ధనియాలు వంటి వాటిని కలిపి లేహ్యం తయారు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలకు అందజేస్తున్నారు. ఈ మందు కోసం స్థానికులే కాకండా ఇతర జిల్లాల నుంచి జనం తరలివస్తున్నారని తెలుస్తోంది.

ఈ ఔషధానికి ఎటువంటి శాస్త్రీయ నిరూపణ లేదు. కాగా ఇలాంటి మందులు, లేహ్యాలు వాడడం వల్ల కరోనా మాట అంటు ఉంచితే ఇతర సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా దాని ఫలితం ఎంత వరకు అనేది ఎలా తెలుస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. ఈ విపత్కర కాలంలో ప్రజలు ఏది పడితే అది కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. లేనిపోని సమస్యలు వస్తే మొదటికే మోసం అని హెచ్చరిస్తున్నారు.

ఈ ఆయుర్వేద మూలిక వ్యవహారం ప్రభుత్వ అధికారుల వరకు పాకింది. వెంటనే అప్రమత్తమైన డీఎంహెచ్వో కృష్ణపట్నానికి చేరుకున్నారు. ఈ నాటు మందుపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఉచితం అంటూ ఈ మూలికలు పంపిణీ చేయడం ఏంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై విచారణ జరిపి కలెక్టర్కు అందజేయనున్నారు. ఈ మందులను వాడిన కొందరు మాత్రం... చాలా బాగా పనిచేస్తున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఆపత్కాలంలో కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది.