Begin typing your search above and press return to search.

మోదీజీ..మీ కొత్త మంత్రి పంచ్‌ లు చూశారా?

By:  Tupaki Desk   |   3 Sep 2017 10:43 AM GMT
మోదీజీ..మీ కొత్త మంత్రి పంచ్‌ లు చూశారా?
X
కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తైంది. అప్పటివరకూ జాబితాలో పేరు లేకున్నా అనూహ్యంగా కొందరు మంత్రులైపోయారు. పలు సమీకరణాల ఆధారంగా కొత్త మంత్రుల జట్టు కూర్పు చేపట్టారు. ఈ సందర్భంగా కొత్త మంత్రుల పనితీరు, సామర్థ్యం.. గతంలో నిర్వహించిన బాధ్యతలను అప్పుడే బేరీజు వేసేస్తున్నారు. దాని ఆధారంగా భవిష్యత్‌ లో వారి పనితీరు ఏ విధంగా ఉండబోతోందో లెక్కలేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరిపై వివాదాలనూ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

తాజాగా.. మోదీ కేబినెట్లోకి సహాయ మంత్రిగా ఎంట్రీ ఇచ్చిన అనంతకుమార్ హెగ్డే కర్ణాటకలోని ఉత్తర కన్నడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హెగ్డే 28 సంవత్సరాల వయసులోనే పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించిన ఈయన కదంబ్ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ డాక్టర్‌ పై దాడి చేసిన వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. త్వైకాండో ఎక్స్‌ పర్ట్ అయిన హెగ్డే వైద్యుడి పీకపట్టుకుని పలు మార్లు ముఖంపై పంచ్‌ లు విసిరాడు.

పక్కనే ఉన్న సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. వారిని హెగ్డే అనుచరులు పక్కకు లాగేయటం ఆ వీడియోలో ఉంది. తీవ్ర గాయాలపాలైన వైద్యుడు తర్వాత దాడి ఘటనను మీడియాకు వివరించారు కూడా.సిర్సి పట్టణంలోని టీఎస్‌ఎస్‌ ఆస్పత్రిలో ఈ ఏడాది జనవరిలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. తన తల్లికి వైద్యం అందించటంలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో వైద్యుడిపై దాడి చేయడంతో హేగ్డేపై కేసు కూడా నమోదు అయ్యింది. వీడియో పాతదే అయినా ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి కావటంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

తాజాగా మంత్రి పదవి చేపట్టిన అనంతకుమార్ హెగ్డేకు వివాదాలు కొత్త కాదు. సంచలన వ్యాఖ్యలు చేయడం, కలకలం సృష్టించడం ఆయనకు అలవాటే. గతంలో ఇస్లాం మతంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాయి. ఇస్లాం ఉన్నంత కాలం టెర్రరిజం ఉంటుందని, ఆ మతాన్ని కూకటివేళ్లతో పెకలిస్తేనే టెర్రరిజం అంతమవుతుందని మంటపుట్టించే వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కున్నారు. అయితే ఎన్ని వివాదాలున్నా 28 ఏళ్ల వయసులోనే రాజకీయ దురంధరుడు మార్గరెట్‌ అల్వాను ఓడించిన అనంత హెగ్డే.. వరుసగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.