Begin typing your search above and press return to search.

కొత్త ఉద్యమం - మర్యాదివ్వండి సార్

By:  Tupaki Desk   |   16 Aug 2022 7:34 AM GMT
కొత్త ఉద్యమం - మర్యాదివ్వండి సార్
X
దేశ ప‌తాకం అంటే అదొక స‌మున్న‌త స్థాయి గౌర‌వం. వీలున్నంత వ‌ర‌కూ భారతీయుల ఆత్మ మ‌న త్రివ‌ర్ణం అన్న‌ది గుర్తు పెట్టుకుని ప్ర‌వ‌ర్తించ‌డం మన క‌ర్త‌వ్యం కావాలి. పంద్రాగ‌స్టు పూన‌కాలు త‌గ్గిపోయాక, ఎవ‌రి విధుల్లోకి వాళ్లంతా వెళ్లిపోయాక ఇంకా చెప్పాలంటే మూడు లేదా నాలుగు రోజుల సెల‌వుల త‌రువాత మ‌న‌కు ఇవేవీ గుర్తుకురావు.

డీపీలు మారిపోతాయి. వీలున్నంత వ‌ర‌కూ మ‌ళ్లీ పంద్రాగ‌స్టు వ‌ర‌కూ అన్నీ మరిచిపోతాం. ఆగస్టు 15న నాడు మనను పూనిన దేశభక్తి అసలు కనిపించకుండా పోతుంది. జెండాకు ఇవ్వాల్సిన గౌర‌వం ఏంటి ? జెండా రంగుల‌కు ఉన్న ప్రాధాన్యం ఏంటి ? అశోక చక్రం చాటుతున్న సందేశం ఏంటి ? ఇవేవీ గుర్తుకు రావు.

ఎందుకంటే మ‌న జీవితాల్లో డైలీ రొటీన్ ది ప్రధాన పాత్ర. ఉద్యోగం ఆఫీసు ఇల్లు మధ్యలో ప్రయాణం. ఎవ్వ‌రం మాత్రం ఏం చేయ‌గ‌లం. ప్ర‌భుత్వాలు చెబుతున్న విధంగా పౌరులు నిన్న‌టి వేళ హ‌ర్ ఘ‌ర్ కా తిరంగా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇదంతా బాగుంది కానీ మరుసటి రోజు ఆ జెండాలన్నీ ఏమవుతాయి? ఆ జెండాల‌కు ద‌క్కే గౌర‌వం మరుసటి రోజున ఏంట‌న్న‌దే ప్ర‌ధాన స‌మ‌స్య‌.

అందుకే కొత్త ఉద్యమం మొదలైంది. పికప్ ఎ ఫాలెన్ ఫ్లాగ్ ... అని. పంద్రాగ‌స్టు త‌రువాత మ‌న దేశ జెండాలు చాలా ఇప్పుడు వీధుల్లో నేల రాలి క‌నిపిస్తుంటాయి. ఇది ఒక విచార‌కర ఘట్టం. ఇటువంటి సంద‌ర్భం నుంచి బ‌య‌ట ప‌డాలంటే అందరూ ఉద్యమంలా కదలాలి అంటున్నారు. దేశ జెండాకు ఇవ్వాల్సినంత గౌర‌వం ఇవ్వాల‌ని త‌ల‌పోస్తూ ఇవాళ మ‌రో డిజిట‌ల్ ఉద్య‌మం జ‌రుగుతోంది.

Pick up the Fallen Flags on 16th August అంటూ ఓ నినాదం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు మ‌రో చ‌ర్చ‌కు తావిస్తోంది. పంద్రాగ‌స్టు వేడుక‌ల త‌రువాత చేయాల్సిన బాధ్య‌తే ఇది.

కానీ చాలా మంది నిర్ల‌క్ష్యం కార‌ణంగా చాలా చోట్ల త్రివ‌ర్ణ ప‌తాకలు ఎటువంటి ఆద‌ర‌ణ లేకుండా చెత్త డ‌బ్బాల‌లో, కుండీల‌లో, మురికి కాల్వ‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. మ‌రి ! దేశ జెండాను కాపాడుకోవాల్సిన ప‌ద్ధ‌తి ఇదేనా ? గౌర‌వించాల్సిన ప‌ద్ధ‌తి కూడా ఇదేనా ? అన్న సందేహాలు రేగుతున్నాయి. అందుకే జెండా మర్యాద కాపాడండి. రాలిపోయిన పడిపోయిన జెండాలు ఏరుకుని భద్రపరచండి అంటున్నారు నెటిజన్లు.