Begin typing your search above and press return to search.

పాక్ ఐఎస్ఐ ఎంట్రీ..ఆఫ్ఘన్ అధినేత రేసులో కొత్త పేరు

By:  Tupaki Desk   |   7 Sep 2021 12:30 PM GMT
పాక్ ఐఎస్ఐ ఎంట్రీ..ఆఫ్ఘన్ అధినేత రేసులో కొత్త పేరు
X
దాదాపుగా 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆఫ్ఘన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ నుండి వెనక్కి వెళ్ళిపోతునట్టు ప్రకటించగానే ఆఘమేఘాలపై తాలిబన్లు ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఆఫ్ఘన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కొన్ని రోజులుగా ఎడతెగని కసరత్తు చేస్తున్నారు తాలిబన్లు. దేశానికి అధినేతగా ఎవరుండాలి, కీలక పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇందుకోసం పలువురి పేర్లు ఖరారైనట్టు వార్తలు వచ్చినా.. వారి నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

అయితే తాజాగా ఈ అంశంలో తాలిబన్లు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ముల్లా మహమ్మద్ హసన్ అఖుండ్‌ను దేశాధ్యక్షుడిగా, ముల్లా బరాదర్ అఖుండ్, ముల్లా అబ్దుస్ సలాంలను ఉపాధ్యక్షులుగా నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆప్ఘనిస్థాన్‌ ను తమ సొంతం చేసుకున్నప్పటికి నుంచి దేశంలోని పరిణామాలను మీడియాకు వివరించే జబివుల్లా ముజ్జాహిద్దీన్, ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ ప్రతినిధిగా వ్యవహరించనున్నారు.

సిరాజ్ జుడిన్ హక్కానీ ఆఫ్ఘనిస్తాన్ కొత్త అంతర్గత మంత్రిగా ఉంటారని, ఆయనే గవర్నర్లందరినీ నామినేట్ చేస్తారని తాలిబన్ వర్గాలు పేర్కొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత పోటీలో ఉన్న సైన్యాన్ని పునరుద్ధరించడానికి హక్కానీకి సూచనలు చేయడం పాకిస్థాన్ ఐఎస్ ఐ చీఫ్ హమీద్ ఫైజ్ కాబూల్ పర్యటన లక్ష్యంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఐఎస్ ఐ హక్కానీ నెట్‌ వర్క్‌ లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ దేశ విదేశాంగ మంత్రి పదవి ముల్లా అమీర్ ఖాన్ ముత్తాకీకి ఖాయమైనట్టు తెలుస్తోంది.

24 గంటల వ్యవధిలో ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్ల నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పదవీ విరమణ చేసిన ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ తజికిస్తాన్‌కు పారిపోయినట్లు సూచించే నివేదికలతో పాటు పంజ్‌షీర్‌ని తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఈ పరిణామం చోటు చేసుకున్న తరువాత నాయకత్వానికి సంబంధించి తాలిబన్లు తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.