Begin typing your search above and press return to search.

2023కు బ‌డ్జెట్‌లో కొత్త పేరు.. వెల్ల‌డించిన నిర్మ‌లా సీతారామ‌న్‌

By:  Tupaki Desk   |   1 Feb 2022 7:39 AM GMT
2023కు బ‌డ్జెట్‌లో కొత్త పేరు.. వెల్ల‌డించిన నిర్మ‌లా సీతారామ‌న్‌
X
పార్ల‌మెంటులో 2022-23 వార్షిక బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టిన‌ నిర్మ‌లా సీతారామ‌న్‌.. 2022-23కు కొత్త పేరు పెట్టారు.. ఈ ఏడాదిని తృణ‌ధాన్యాల అభివృద్ధి సంవ‌త్స‌రంగా పేర్కొన్నారు. పీఎం గతిశక్తి మాస్టర్‌ ప్లాన్ ప్ర‌కారం.. దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేయ‌నున్న‌ట్టుచెప్పారు. పర్వతమా ల ప్రాజెక్టు కింద పర్యావరణ హితమైన అభివృద్ధికి శ్రీకారం చుడ‌తామ‌న్నారు. పర్వత ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి తగినంత అవకాశాలు ఉన్నాయ‌ని, పర్వతమాల ప్రాజెక్టులో 8 రోప్‌వేల అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు. దేశంలో నాలుగుచోట్ల మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించారు..

మ‌ల్టీమోడల్‌ కనెక్టివిటీలో భాగంగా రైల్వేలతో ఇతర రవాణా సదుపాయాల అనుసంధానం చేయ‌నున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. వచ్చే మూడేళ్లలో వంద కార్గో టెర్మినళ్ల ఏర్పాటు చేస్తామ‌న్నారు. చిరుధా న్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం ఇస్తామ‌న్నారు. 2023 తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్న ట్టు చెప్పారు. వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి పెంచే ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తామ‌న్నారు.. రసాయన రహిత వ్యవసాయ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఉంటుంద‌ని తెలిపారు.

సేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వ‌నున్న‌ట్టు బ‌డ్జెట్‌లో నిర్మ‌ల స్ప‌ష్టం చేశారు. చిన్న‌, సూక్ష్మ త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల మార్కెటింగ్‌ సహకారం కోసం నూతన పోర్టల్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఎంఎస్ ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. చిన్న, మధ్యత రహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్‌ గ్యారంటీ పథకం త్వ‌ర‌లోనే తీసుకువ‌స్తామ‌న్నారు. క్రెడిట్‌ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు కేటాయించిన‌ట్టు వెల్ల‌డించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం అదనపు నిధులు, ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు.

ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు అవకాశాలు క‌ల్పించ‌నున్న ట్టు నిర్మ‌ల పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా జిల్లాల వారీ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం అమ‌లు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. మహిళా, శిశు సంక్షేమం కోసం మిషన్‌ శక్తి, వాత్సల్య, అంగన్‌వాడీల రూపకల్పనకు ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. గత రెండేళ్లలో నల్ సే జల్‌ కింద 5.7 కోట్ల కుటుంబాలకు అందుబాటులోకి తాగునీరు తెచ్చామ‌న్నారు.

పీఎం ఆవాస యోజన కింద 80 లక్షల గృహాల నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు. కరోనాతో దేశవ్యాప్తంగా అనేకమందికి మానసిక రుగ్మతలు ఉత్పన్నమయ్యాయని నిర్మ‌ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బెంగళూరు ట్రిపుల్‌ ఐటీ సాంకేతిక సాయంతో మానసిక సమస్యల చికిత్స కోసం ఆన్‌లైన్‌ టెలీమెడిసిన్‌ విధానానికి రూపకల్పన చేయ‌నున్న‌ట్టు నిర్మ‌ల వివ‌రించారు..