Begin typing your search above and press return to search.

తెలంగాణ కొత్త పార్టీలకు అంత సత్తా ఉందా?

By:  Tupaki Desk   |   10 Aug 2021 4:34 AM GMT
తెలంగాణ కొత్త పార్టీలకు అంత సత్తా ఉందా?
X
తెలంగాణలో రాజకీయం ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆరేళ్లపాటు ఎలాంటి చడీచప్పుడు చేయని రాజకీయ పార్టీలు ఇప్పుడు యాక్టివ్ అయ్యాయి. కొత్త పార్టీలతో పాటు ఇప్పటి వరకు ఎలాంటి సందడి లేని పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఎవరికి వారే ప్రత్యేక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం కోసం పనిచేస్తామని చెబుతున్నాయి. ఇప్పటి వరకు జాతీయ కాంగ్రెస్ తో పాటు టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేక తెలంగాణలో అధికారం చెలాయించాయి. మధ్యలో ఎన్నో పార్టీలు వచ్చాయి. కానీ చివరి వరకూ కొనసాగలేకపోయాయి. మరో రెండేళ్లలో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త పార్టీల జోరు సాగుతోంది. మరి ఈ పార్టీలు అధికారం కోసమేనా..? లేక పెద్ద పార్టీలకు మద్దతు ఇవ్వనున్నాయా..? అనే చర్చ సాగుతోంది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా కాంగ్రెస్ చాలా సీట్లు గెలుచుకుంది. అయితే 2018లో మాత్రం టీఆర్ఎస్ 80 కి పైగా సీట్లు గెలుచుకొని రెండోసారి అధికారంలో కూర్చుంది. ఆ తరువాత కొద్దో గొప్పో ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ మనుగడ లేకుండా గులాబీ అధిష్టానం వ్యూహం పన్నింది. దీంతో కాంగ్రెస్ దుకానం మూయడం ఖాయం అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు
అయ్యాక పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఇప్పటికే చాలా సార్లు రాష్ట్రంలో అధికారంలో ఉంది గనుక ఆ పార్టీ అధికారంలో వస్తుందనడంపై ప్రజలు కొంత ఆలోచిస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్నా ఒకటి, రెండు సీట్లతోనే ఉన్న బీజేపీకి దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతో కొంత ఊపు వచ్చింది. ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కొంత హవా సాగించడంతో అధికారంపై ఆ పార్టీ నాయకులు నమ్మకం పెట్టుకున్నారు. అయితే కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీకి లాభం అని కొందరు అనుకుంటున్నారు. కానీ అంతకుముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందువల్ల అప్పటికే ఇక్కడి ప్రజలు నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. దీంతో ప్రభుత్వ పథకాలు ప్రజలపై కుమ్మరిస్తున్న టీఆర్ఎస్ నుంచి ప్రజలను కాషాయం నాయకులు ఎలా తమవైపు తిప్పుకోగలుతారో చూడాలి.

కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలు.. ఇవి కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి.. ఒకవేళ తెలంగాణలో అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ తెలంగాణలో కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు తాము అధికారంలోకి వస్తామని చెప్పడంపై ప్రజలు నిశితంగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజలు ఆదరించలేదు. దీంతో ఆ పార్టీ ఇక్కడి నుంచి ఏపీకి వెళ్లింది. ఆ తరువాత సినీ నటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో ప్రజల్లోకి వెళ్లారు. పవన్ ను సినిమాల్లో ఆదరించారు గానీ.. రాజకీయంగా మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో మరో అవకాశంగా ప్రయత్నిస్తున్నారు.

ఈ తరుణంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల కొత్త పార్టీతో ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరిగిందనే నినాదంతో దీక్షలు చేపడుతున్నారు. అయితే షర్మిలకు వ్యక్తిగతంగా రాజకీయ అనుభవం లేకున్నా.. ఆమె రాజకీయ కుటుంబ నుంచి వచ్చింది. దీంతో రాజన్న రాజ్యం అనే సెంటిమెంట్ తో జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య పోరు తీవ్రం ఉన్న సమయంలో షర్మిల పార్టీని ఎంత మంది ఆదరిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ షర్మిల పార్టీ కొన్ని సీట్లు గెలుచుకున్నా అధికార పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు.

ఇక తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి కొత్త నినాదాన్ని పలుకుతున్నారు. బీఎస్పీ కొత్త పార్టీ కాకపోయినా గతంలో ఈ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్పలు ఆ తరువాత టీఆర్ఎస్లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ తెలంగాణలో బీఎస్పీని అధికారంలోకి తేగలడా..? అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఒకవేళ బీఎస్పీ నుంచి కొందరు గెలిచినా ఆ తరువాత అధికార పార్టీలోకి వెళ్లలేరని చెప్పలేం. దీంతో చిన్నా చితక పార్టీలను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారోనన్న చర్చ సాగుతోంది.